కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం..

కామారెడ్డి నగరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ఎదుట అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న హమాలీల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఎవరికీ ప్రాణహాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు మొత్తం 29 మంది ఉన్నారు. ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన కొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బస్సు డ్రైవర్ బాపురావు గత రెండు, మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టు పోలీసులతో చెప్పారు. కలెక్టరేట్ వద్దకు రాగానే కళ్లు తిరిగినట్టు కావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ పైకెక్కి కొంత దూరం అలాగే ముందుకెళ్లి బోల్తా పడింది. బోల్తా పడి అలాగే ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది.