25 % ధ‌ర‌లు త‌గ్గించిన మెట్రో

HYD Metro
HYD Metro

హైద‌రాబాద్ః ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు అయిన మెట్రోను హైదరాబాదీలు ఎంతో ఆదరిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య చేపట్టిన ప్రాజెక్టు పూర్తి కావడానికి హైదరాబాదీల సహకారం ఎంతో ఉంది. మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ సంస్థ రూ.14261 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) రూ.2250 కోట్ల చొప్పున మొత్తం రూ.16511 కోట్లు ఖర్చు చేశామని మెట్రో ఎం.డి. ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ప్రారంభమై 30 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగర వాసుల చిరకాల స్వప్నమైన మెట్రో రైలు సాకారమైందని, నెల రోజులుగా నగర వాసులు ఎంతో ఉత్సాహంగా, క్రమశిక్షణతో మెట్రో ప్రయాణాన్ని అనుభవించారన్నారు. 9నెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణ పనులను 3నెలల్లోనే పూర్తి చేసి నవంబర్‌ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభించామన్నారు.
30 రోజుల్లో మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య 32.25 లక్షలకు పైగానే ఉందని మెట్రో ఎం.డి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. జనవరి 15 కల్లా మెట్రో స్టేషన్ల కింద పట్టణ పునఃనిర్మాణం పనులు పూర్తవుతాయని, దీంతో నగరంలో మెట్రో రాకతో ఆ ప్రాంతంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అతి పెద్ద ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌గా నిర్మితమైన అమీర్‌పేట కోసం ఎల్‌ అండ్‌ టీ సుమారు రూ.250 కోట్లు వెచ్చించింది. అలాగే ప్రతి మెట్రో స్టేషన్‌ రూ.60 కోట్ల చొప్పున ఎల్‌ అండ్‌ టీ ఖర్చు చేయగా, ప్రభుత్వం తరపున హెచ్‌ఎంఆర్‌ ప్రతి మెట్రో స్టేషన్‌ కింద రోడ్డు భాగంలో రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలిపారు. చెత్త బుట్టల ఏర్పాటులో భద్రతా పరమైన ఇబ్బందులున్నాయి. త్వరలోనే వాటిని తీసుకువచ్చేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి మెట్రోస్టేషన్‌ కింద రోడ్డు భాగంలో 2మూత్రశాలలను బీవోటీ ప్రాతిపదికన నిర్మించేందుకు టెండర్లు పిలిచామన్నారు.