25న ప్రధాని నరేంద్రమోడీతో కెసిఆర్‌ భేటీ

Modi , Kcr
Modi , Kcr

23 నుంచి పలు రాష్ట్రాల్లో విస్తృత పర్యటన
తొలి రోజు విశాఖలోని శారదా పీఠం సందర్శన
అదే రోజు సాయంత్ర ఒడిశ్సా సిఎంతో భేటీ
24న పశ్చిమ బెంగాల్‌లో మమతతో భేటీ
నెల రోజుల పాటు ప్రత్యేక విమానం ఎంగేజ్‌
హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కసరత్తును చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్‌,బిజెపియేతర కూటమి లక్ష్యంగా కూర్పు చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకు ఈనెల 23 నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం నెల రోజు పాటు ప్రత్యేక విమానాన్ని ఎంగేజ్‌ చేసుకున్నారు. ఈనెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పర్యటించనున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ కోసం నెల రోజుల పాటు ఎంగేజ్‌ చేసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలో శారద పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుం టారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ బయలుదేరుతారు. ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సిఎం కెసిఆర్‌ సమావేశం అవుతారు. ఆ రోజు ఒడిశా సిఎం అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్‌ దేవాలయం సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్‌ చేరుకుని మధ్యాహ్నం భోజనం చేస్తారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలోనే కోల్‌కత్తా వెళ్తారు. ఈనెల 24న సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సిఎం కెసిఆర్‌ కోల్‌కత్తాలో సమావేశం అవుతారు. అనంతరం అక్కడ కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీ వెళ్తారు. ఈ నెల 25వ తేదీ నుంచి సిఎం కెసిఆర్‌ రెండు,మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌తో సమావేశం అవుతారు. బిఎస్పీ అధ్యక్షురాలు=,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమాజ్‌వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో విడివిడిగా సమావేశం అవుతారు. ఇదే పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన ఆంశాలపై చర్చిస్తారు. కాగా, ఫెడరల్‌ ప్రంట్‌ ఏర్పాటు విషయంలో ఈ నెలాఖరులో ఢిల్లీలోనే ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మీడియా సమావేశం నిర్వహించి బిజెపి,కాంగ్రెస్‌ యేతర పక్షాల కూటమి ఆవశ్యకతపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.