ఒకే హాస్టల్‌లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా

ముగ్గురు సిబ్బంది, మిగతా వారంతా విద్యార్థులే

ముంబయి: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. అక్క‌డి వాషిమ్‌ జిల్లాలోని ఓ స్కూల్ హాస్ట‌ల్‌లో ఏకంగా 229 మంది విద్యార్థులు క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో స్కూల్ ప‌రిస‌రాల‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారంతా విద్యార్థులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిం, అకోలా, ముల్దానా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అందులోనూ ఒక్క అమరావతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. వెంటనే పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని క్వారంటైన్ చేశారు.


కాగా, గ‌డిచిన 24 గంట‌ల్లోనే మ‌హారాష్ట్ర‌లో మొత్తం 8 వేల కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, ముంబయి మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ హెచ్చ‌రిస్తున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/