కాబూల్‌ దాడి..22 మంది బలి

మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే

కాబూల్‌ దాడి..22 మంది బలి
22-killed-in-terror-attack-at-kabul-university

కాబూల్‌: కాబూల్ విశ్వవిద్యాలయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో 22 మందిని బలితీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. కాబూల్ యూనివర్సిటీలో నిన్న నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి బహదూర్ అమినియన్, సాంస్కృతిక దౌత్యవేత్త మొజ్తాబా నొరూజితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్న సమాచారం తెలుసుకున్న ఉగ్రవాదులు చెలరేగిపోయారు.

అత్యాధునిక తుపాకులతో యూనివర్సిటీలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు విద్యార్థులపైకి తూటాల వర్షం కురిపించారు. ఏం జరుగుతోందో తెలిసే లోపే 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 5 గంటలపాటు కాల్పులు కొనసాగాయి. దీంతో తుపాకులు, గ్రనేడ్ల మోతతో యూనివర్సిటీ దద్దరిల్లిపోయింది. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదులు ముగ్గురూ హతమయ్యారు. యూనివర్సిటీలో ఉగ్రఘటనను భారత ప్రధాని నరేంద్రమోడి తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరులో ఆఫ్ఘనిస్థాన్‌కు భారత సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/