22న తొలి సిడబ్ల్యుసి సమావేశం

23మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతస్థాయి వర్కింగ్ కమిటీని కొత్త పాతనేతల కలయికతో ఏర్పాటుచేసారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం సిడబ్ల్యుసి కమిటీని ప్రకటించారు అంతేకాకుండా ఈనెల 22వ తేదీ ఎఐసిసి అధ్యక్ష హోదాలో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తకమిటీలో మొత్తం 23 మంది సభ్యులు, 19 మంది శాశ్వత ఆహ్వానితులు, తొమ్మిదిమంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. వివిధ రాష్ట్రాలకు ఏర్పాటయిన స్వతంత్ర ఇన్ఛార్జిలుసైతం శాశ్వత ఆహ్వానితుల్లో ఉంటారు. వీరిని ఎక్స్అఫీషియో సభ్యులుగా పిలుస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు కమిటీలో న్రపాతినిధ్యం వహిస్తారు. ఐఎన్టియుసి, సేవాదళ్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐకు చెందిన వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణిస్తారు. ఈనెల 22వ తేదీ జరగనున్న ఈ పార్టీ సమావేశానికి అన్ని రాష్ట్రాల అధ్యక్షుడు, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులనుసైతం ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా వర్కింగ్ కమిటీ రద్దయింది. అంతకుముందున్న ప్యానెల్ స్టీరింగ్ కమిటీగా మారింది. పార్టీ ప్లీనరీ జరిగేంతవరకూ స్టీరింగ్ కమిటీగానే నడిచింది. పార్టీ తీసుకునే అన్ని కీలకనిర్ణయాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదే క్రియాశీలక పాత్రగా ఉంటుంది. స్టీరింగ్ కమిటీకి సీనియర్ నాయకులు ప్రధాని మన్మోహన్సింగ్, పి.చిదంబరం, గులామ్‌నబీ ఆజాద్, జనార్ధన్ద్వివేదిలను ఎంపికచేసారు. ఇక కొత్తటీమ్‌లో రాజ్యసభ, లోక్‌సభాపక్ష నాయకులు, మాజీ మంత్రి ఎకె ఆంథోని, ఆనంద్‌శర్మ, రాజకీయ కార్యదర్శి అహ్మద్పేటల్ వంటివారిని నియమించారు. ప్రస్తుతం రాహుల్ దృష్టి అంతా లోక్‌సభ ఎన్నికలు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్లలోని ఎన్నికలపైనే ఉంది. ఇదిలా ఉండగా రెండు తెలుగురాష్ట్రాలనుంచి ఏ ఒక్క సీనియర్ నాయకుణ్ణి సిడబ్ల్యుసిలో నియమించకపోవడంపై రెండురాష్ట్రాల నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.