21 త‌ర్వాత ఎప్పుడైనా ఆర్టీసి స‌మ్మెః టిఎంయూ

tsrtc busses
tsrtc busses

హైద‌రాబాద్ః ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. వేతనాలు పెంచకుండా యాజమాన్యం చేస్తున్న తాత్సారంతో విసిగిన కార్మికులు ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు సంస్థలో గుర్తింపు పొందిన ‘తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ)’ నేతలు సోమవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(అడ్మిన్‌) శివకుమార్‌కు నోటీసు అందజేశారు. కొత్త వేతనాలను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సహా 72 డిమాండ్లను ఈ నెల 21లోపు పరిష్కరించాలని, లేకుంటే ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డి పేరిట ఇచ్చిన ఈ నోటీసుపై టీఎంయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.థామ్‌సరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ జి.ఎల్‌.గౌడ్‌, కోశాధికారి కె.రాజలింగం, కార్యదర్శులు వి.ఎ్‌స.రెడ్డి, వి.యాదయ్య సంతకాలు చేశారు. రాష్ట్రంలోని 97 డిపోలు, ఇతర ఆర్టీసీ యూనిట్లన్నింటిలో బస్సులను బంద్‌ చేస్తామన్నారు.