ఖైరతాబాద్‌ గణేష్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా జరిగింది

వినాయకచవితి వస్తుందంటే అందరి చూపు ఖైరతాబాదు వినాయకుడికి పైనే ఉంటుంది. ప్రతి సంవత్సరం 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు.

1954లో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60ఏళ్ళు వరకు ఒక్కో అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు.

గతేడాది కరోనా కారణంగా వేడుకలు లేకుండానే ముగిసిపోయింది. ఇళ్లవద్దనే చిన్న విగ్రహాలు నిలబెట్టి పూజలు చేశారు. గతేడాది విగ్రహ తయారీదారులు కూడా భారీగా నష్టపోయారు. అయితే ఈ ఏడాది వినాయక ఉత్సవాలకు అనుమతి రావడంతో పెద్ద సంఖ్యలో దేవుడి విగ్రహాలు కొలువుదీరనున్నాయి. గల్లికా గణేష్ పాటలతో పల్లెపల్లె మారుమోగనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 40 అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి శిల్పి రాజేంద్రన్ నేత్రాలు అలంకరించారు. వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్‌ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్‌ చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు.