2018 జూలై నాటికి గంగా ప్రక్షాళన పూర్తి చేస్తాం

UMABHARATHI
పార్లమెంటులో జలవనరుల మంత్రి ఉమాభారతి
న్యూఢిల్లీ : గంగా ప్రక్షాళన ప్రాజెక్టు కింద 2018 జులైనాటికి నదీ ప్రక్షాళన పూర్తి చేసి ఆధునీకరణ పనులు కూడా పూర్తిచేస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వెల్లడించారు. గురువారం పార్లమెంటు ప్రశ్నోత్తరాలసమయంలో అనేకఅనుబంధ ప్రశ్నలపై ఆమె స్పందించారు. జులై 2018 నాడే గంగానది పూర్తిస్థాయిలో ప్రక్షాళన పూర్తిచేసి ఆధునీకరిస్తా మని పార్లమెంటులో కూడా ప్రకటన కూడా చేస్తామన్నారు. డాల్ఫిన్‌ జలచరాలు, తాబేళ్లు, బంగారుచేపలు వంటి వాటి రాకతో గంగానదిలో మత్స్య సంపద తిరిగి పునరుజ్జీవంపోసుకు న్నట్లయిందని అన్నారు. ఒక నదిని ప్రక్షాళన చేయాలంటే ఒక ప్రయోగశాలలో చేయడం సాధ్యం కాదని, అక్కడయితే ప్యాకేజ్డ్‌ తాగు నీటిని పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. సమాజ్‌వాది నేత ములాయంసింగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఈ నదీ జలాలు పొలాల్లోనికి వెళ్లేటట్లు చర్యలు తీసుకోవాలని, గంగానదిలోనికి మురుగునీరు వెళ్లకుండా చూడాలని కోరారు. రైతులకు ఎరువులుగా కూడా ఉపయోగపడతాయని అంతేకాకుండా నదులను కాలుష్యం నుంచి పరిరక్షించినట్లవుతుందన్నారు. దీనిపై కేంద్ర జలవనరుల మంత్రి స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ములాయం కుమారుడు సిఎం అఖిలేష్‌ యాదవ్‌ తాను మధురా, బృందావన్‌లలో చేపట్టిన ప్రాజెక్టులకు నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు జారీచేసేటట్లు చెప్పాలని కోరారు. కేంద్ర మంత్రిగా తాను అఖిలేష్‌ యాదవ్‌ అపాయింట్‌మెంట్‌ పొందలేకపోతున్నానని, సమాజ్‌వాది పార్టీ అధినేత యుపి సిఎం అపాయింట్‌మెంట్‌ తనకు శుక్రవారం లభించేటట్లు చూడాలని సూచించారు. గంగానదీ ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రాధాన్యత చూపించడం లేదన్న విమర్శలను ఉమాభారతి కొట్టిపారేసారు. గడచిన 29 ఏళ్లలో సాధించలేనిది తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్లు ఖర్చుచేసిన తర్వాత సాధించ గలిగామని స్పష్టం చేశారు.