టీమిండియా కోచ్ పదవికి 2000 దరఖాస్తులు!
టీమిండియా కోచ్ పదవికి భారీ డిమాండ్

ముంబయి: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి విపరీత పోటీ ఏర్పడింది. భారత క్రికెట్ బోర్డు వివిధ కోచ్ పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌తో సహా సహాయక బృందం ఎంపిక కోసం బిసిసిఐ దరఖాస్తులను కోరింది. దీనికి భారీ స్పందన లభించిందని ఓ జాతీయ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దాదాపు రెండు వేల వరకు దరఖాస్తులు వచ్చాయని ఆ పత్రిక పేర్కొంది. అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి దీటుగా అందులో ఎవరూ పోటీకి లేరని ఆ పత్రిక రాసుకొచ్చింది. కోచింగ్‌లో అత్యుత్తమ అనుభవమున్న ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టామ్మూడీతో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్, ప్రస్తుత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. మరోవైపు భారత్ నుంచి రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్.. ఇద్దరే దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే తొలుత ఈ పదవిపై ఆసక్తి కనబర్చినా ఇప్పుడు దరఖాస్తు చేయకపోవడం గమనార్హమని ఆ పత్రిక వెల్లడించింది. దక్షిణాఫ్రికా ఆల్‌టైమ్ ఫీల్డింగ్ స్టార్ జాంటీరోడ్స్ సైతం భారత ఫీల్డింగ్ కోచ్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నాడని, ఈ మేరకు అతడు దరఖాస్తు చేసుకున్నాడని తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/