కృష్ణష్టమి రోజున మథురలో తీవ్ర విషాదం

కృష్ణష్టమి రోజున మథురలో తీవ్ర విషాదం నెలకొంది. వేడుకల్లో తొక్కిసలాట కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మథురలోని బంకే బిహరీ ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జన్మాష్టమి వేడుకలను నిర్వహించగా.. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. హారతి ఇస్తున్న సమయంలో భక్తులు ఎగబడటం తొక్కిసలాటకు దారితీసిందని మథుర సీనియర్ పోలీస్ అధికారి అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ మహిళ, ఓ పురుషుడు ఊపిరాడక చనిపోయారు.

అంతకు ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ‘‘పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం’’ అన్న శ్రీ కృష్ణ భగవానుడి బోధనలు మన ఆలోచనలు, మన చర్యలు, మన దృష్టిని ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.