అమృత్‌సర్‌ సమీపంలో ఎన్‌కౌంటర్…సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతం

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా చీచా భక్నా గ్రామంలో మూసేవాలా హత్యతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. ఓ ఇంట్లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారు.

పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనుమానితులు మన్‌ప్రీత్ మన్నూ , జగ్‌రూప్ సింగ్ రూపా ఇద్దరు హతమయ్యారు. ఘటనాస్థలంలో ఏకే 47రైఫిల్, పిస్తోలుతో పాటు భారీ సంఖ్యలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మే 29న కాంగ్రెస్ నేత, ర్యాపర్ సిద్దూ మూసేవాలా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మన్సా జిల్లాలోని మూసా గ్రామంలో మన్ను కుస్సా సిద్ధూపై ఏకే 47తో కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.