చర్చివద్ద కాల్పుల మోత.. ఇద్దరు మహిళలు మృతి

2 people and shooter die in shooting outside Iowa church

అమెరికా : అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మెక్సికో, ఓక్లహోమా ఘటనలు మరువక ముందే.. ఏమ్స్‌లోని కార్నర్‌స్టోన్ చర్చి బయట మారోమారు తుపాకీ గర్జించింది. ఆగంతుకుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. ఘటనాస్థలిలో దుండగుడి మృతదేహాన్ని సైతం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుండగుడు కాల్పులు జరిపాక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

అంతేకాక అమెరికాలో గురువారం మరో చోట కూడా కాల్పులు జరిగాయి. విస్కాన్సిన్​లోని గ్రేస్​ల్యాండ్​ శ్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో చెలరేగాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఓ 37ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు ఖననం చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ మధ్యకాలంలో అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఉదంతాలు- అగ్రరాజ్యం అమెరికాను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా ప్రేరేపించాయి. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న తుపాకుల సంస్కృతిపై ఉక్కుపాదం మోపే దిశగా కదిలించాయి. రక్తపాతాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. త్వరలోనే వాటిపై చట్టాలను తీసుకొస్తామని వెల్లడించారు.అమెరికాలో 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా తుపాకులను కొనుగోలు చేయవచ్చు. ఈ వయస్సు నిబంధనను సవరించనున్నట్లు జో బైడెన్ తెలిపారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారే గన్స్ కొనుగోలు చేయగలరని అన్నారు. దీనిపై చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను కోరారు. హైకెపాసిటీ మేగజైన్స్‌లో 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపేలా బుల్లెట్స్‌ను నింపవచ్చని, వాటిని కూడా నియంత్రించాలని సూచించారు. వాటితో పాటు ఏకే 47, ఏకే 15 సహా.. తొమ్మిది రకాల వెపన్స్‌ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/