రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి: సీఎస్‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్పటి వరకూ 2కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. చాలా తక్కువ సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసి, జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు ఆయన తెలిపారు.బుధవారం బిఆర్‌కె భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయాశాఖల అధికారులను సీఎస్‌ ప్రశంసించారు. అర్హులైన వారికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడంలో అధికారులు, సిబ్బంది నిరంతరంగా శ్రమించారని అన్నారు. 2021, జనరిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు.

జూన్‌ 25 నాటికే కోటి మందికి వ్యాక్సిన్‌పంపిణీ చేశారని, 78 రోజుల్లో మరో కోటి మందికి కోవిడ్‌ టీకా ఇచ్చినట్టు తెలిపారు. ఈ నెలాఖారు నాటికి రాష్ట్రంలో మరో కోటి మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకున్నట్టు సీఎస్‌ తెలిపారు. ఇప్పటి వరకూ 52శాతం మంది ఒక డోసు టీకా తీసుకున్నట్టు తెలిపారు. ఇక జీహెచ్‌ఎంసి పరిధిలో దాదాపు వందశాతం వ్యాక్సినేషన్‌ జరిగిందని సీఎస్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రజ్వి, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌, ప్రజారోగ్యశాఖ కార్యదర్శి జి.శ్రీనివాస్‌రావు, సీఎం ఓఎస్‌డి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/