2న బిజెపి రెండో జాబితా?

BJP
BJP

త్వరలో ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మన్‌
సమావేశమైన బిజెపి ఎలక్షన్‌ కమిటీ-రెండో జాబితా ఖరారుపై చర్చ
హైదరాబాద్‌: తెలంగాణలో జరుగుతోన్న ముందస్తు శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థుల రెండవ జాబితాను నవంబర్‌ 2వ తేదీన విడుదల చేసేందుకు ఆపార్టీ రాష్ట్ర నాయకులు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితాగా 38 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆపార్టీ..రెండో విడతలో కనీసం 50 స్థానాలను ప్రకటించడానికి రంగం సిద్దం చేస్తోందని సమాచారం. ఈ మేరకు పార్టీ నేషనల్‌ కమిటీ అనుమతి కోసం రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్‌ త్వరలో ఢిల్లీ బయలుదేరుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుండి టికెట్లు ప్రకటించిన తర్వాత ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారికి తమ పార్టీ తీర్థం ఇచ్చి టికెట్లు ఇవ్వడానికి బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రారంభంలో ఓ పథకాన్ని రూపొందించుకోంది.
అయితే గెలిచినా..ఓడినా..పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసే కార్యకర్తలకే ఆవకాశం ఇవ్వాలి కానీ..ఇలా ఎవరికి పడితే వారిన చేర్చుకొని టిక్కెట్లు ఇస్తే తమ పార్టీ మూల సిద్ధాంతాలకు ప్రమాదం దాపురిస్తుందని జాతీయ నాయకత్వం ఆ ఆలోచనకు బ్రేక్‌ వేసింది. జాతీయ నాయకత్వమే అంత క్లారిటీగా ఉంటే తమకెందుకొచ్చిన టెన్షన్‌ ఎమిటని భావించిన రాష్ట్ర నాయకత్వం కూడా త్వరితగతిన టిక్కెట్లు పంపిణి తంతుని పూర్తి చేయడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఎలక్షన్‌ కమిటీ సమావేశమైంది. దీనికి కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్‌ఛార్జి జేపి నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్ష్మన్‌, బిజెపి ఎల్‌పి మాజీ నేత జి.కిషన్‌రెడ్డి, ఇతర నాయకులు హాజరైనారు. ఈసమావేశంలో ప్రధానంగా రెండో విడత జాబితాలో ఖరారు చేయనున్న అభ్యర్థులపై చర్చించారు. ఈసారి దాదాపు 50 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావించిన కమిటీ ఈమేరకు వారి బల బలాలపై క్షుణ్ణంగా చర్చించారని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో ఇతర ప్రధాన పార్టీల్లోని బలమైన నేతలకు ఒకవేళ టిక్కెట్లు రాకపోతే..తమ వైపు వస్తే టిక్కెట్లు ఇచ్చి గెలుపుకు దోహపడేలా గతంలోనే వ్యూహం రూపొందించుకున్నారు.
కానీ.. బిజెపి రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం తాజాగా జారీ చేసిన అదేశాల మేరకు పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో ఎంతోకాలంగా పనిచేస్తున్న ప్రజల్లో మంచి పేరున్న నాయకులను గుర్తించి టిక్కెట్లు ఇవ్వడానికి వడపోతను ఈసమావేశంలో చేపట్టారని సమాచారం. అధికార టిఆర్‌ఎస్‌ ఇప్పటికే 107 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఆపార్టీ కూడా నవంబర్‌ 2నే మిగతా 10 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సిద్ద పడుతుందని తెలుస్తోంది. ఈదశలో తాము కూడా ఇంకా తాత్సారం చేయకుండా రెండోవిడత జాబితాను వెల్లడించేందుకు రాష్ట్ర కమలనాథులు ముందుకు సాగుతోన్నారు.