ఈఎస్ఐ స్కాంలో 19 మంది : ఏసీబీ వెల్లడి

అరెస్టులపై ఏసీబీ ప్రకటన

19 people on ESI scam: ACB reveals

Amaravati: ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరు డాక్టర్లను అరెస్టు చేసినట్లు ఏసీబీ ప్రకటించింది.

ఈ స్కాంలో మొత్తం 19 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ అదికారులు విశాఖలో ప్రకటించారు. ఈ కేసులో అన్ని ఆధారాలతోనే అరెస్టులు చేస్తున్నట్లు ఏసీబీ జేడీ రవికుమార్ వెల్లడించారు.

అరెస్టులపై ఏసీబీ ప్రకటన.

గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏపీలో చోటు చేసుకున్న రూ.151 కోట్ల విలువైన ఈఎస్ఐ మందులు, పరికరాల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరు డాక్టర్లను ఇవాళ అరెస్టు చేసినట్లు ఏసీబీ కొద్దిసేపటి క్రితం విశాఖలో ప్రకటించింది.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన స్వగృహంలోనే అరెస్టు చేసినట్లు ఏసీబీ జేడీ రవికుమార్ విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రకటించారు.

అచ్చెన్నాయుడుతో పాటు తిరుపతిలో డాక్టర్ రమేష్ కుమార్, రాజమండ్రిలో డాక్టర్ విజయ్ కుమార్ లను అరెస్టు చేసినట్లు రవికుమార్ వెల్లడించారు.

విజయవాడ కోర్టుకు…

.ఈఎస్ఐ కుంభకోణంలో ఇప్పటివరకూ అరెస్టు చేసిన ముగ్గురితో పాటు మరో ముగ్గురు డాక్టర్లు ఏంకేబీ చక్రవర్తి, డాక్టర్ జనార్ధన్, సూపరింటెండ్ రమేష్ బాబును కూడా మరో ఏసీబీ బృందం అరెస్టు చేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఆరుగురిని సాయంత్రం విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారులు ధృవీకరించారు.

కుంభకోణం జరిగిన ఈఎస్ఐ ఆస్పత్రి రాజధాని అమరావతి పరిధిలో ఉన్నందున విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో వీరిని ప్రవేశపెట్టబోతున్నారు.

మొత్తం 19 మంది పాత్ర….

రూ.151 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాలు, బయోమెట్రిక్ మెషీన్ల కొనుగోలులో అక్రమాలకు మొత్తం 19 మందిని బాధ్యులుగా ఏసీబీ గుర్తించింది.

ఇప్పటికే వీరిలో పలువురు అధికారులు సస్పెన్షన్ లోనే ఉన్నారు.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మందులు, వైద్యపరికాల కొనుగోళ్లలో నామినేషన్ పద్ధతిలో టెండర్లకు అనుమతి ఇవ్వడం ద్వారా అక్రమాలకు అవకాశం ఇచ్చాలని ఏసీబీ ఆరోపిస్తోంది.

మంత్రి పేషీ నుంచి అందుకున్న ఆదేశాలతో కిందిస్ధాయిలో ఉన్న అధికారులు, డాక్టర్లు ఈ అక్రమాలకు సహకరించారనేది ఏసీబీ ఆరోపణ.

దీంతో ఇవాళ ప్రాధమికంగా ఆరుగురిని అరెస్టు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. మిగతా వారిని తదుపరి దశలో అరెస్టు చేయనున్నారు.

కస్టడీ కోరే అవకాశం…

ఈఎస్ఐ స్కాంలో నిందితులుగా పేర్కొంటూ ఇవాళ మొత్తం ఆరుగురిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టేందుకు అధికారులు.సిద్ధమవుతున్నారు.

వీరిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశముంది.

రిమాండ్ తో పాటు కస్టడీకి కూడా ఏసీబీ కోర్టు అనుమతిస్తే విజయవాడలోనే వారిని ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అధికారుల సమక్షంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తేనే ఈ కేసులో వాస్తవాలు బయటికి వస్తాయని ఏసీబీ భావిస్తోంది.

అందుకే ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టాక కస్టడీ కోసం మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/