నేటి నుండే 18 గంటల కర్ఫ్యూ.. తస్మాత్ జాగ్రత్త!

నేటి నుండే 18 గంటల కర్ఫ్యూ.. తస్మాత్ జాగ్రత్త!

కరోనా సెకండ్ వేవ్‌తో యావత్ దేశం అల్లకల్లోలంగా మారుతుండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లోకి వెళ్లినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం రాత్రి కర్ఫ్యూ విధించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఇక్కడి నాయకులు. అయితే ఏపీ సీఎం జగన్ గతకొద్ది రోజులగా కరోనా ప్రభావంపై తీవ్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించిన మే 5 నుండి రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ 18 గంటల కర్ఫ్యూ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈరోజు నుండే ఈ 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి రానుంది. అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు కేవలం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలు మొదలుకొని మందుల వరకు ఈ సమయంలోనే తెచ్చిపెట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ కర్ఫ్యూ నుండి అత్యవసర సేవలకు మినహాయింపును ఇచ్చారు.

ఈ కర్ఫ్యూ సమయంలో ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లేవారికి, ప్రభుత్వం ఎంపిక చేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాలకు వెళ్లేవారికి మాత్రం అనుమతినిచ్చారు. మరి ఈ 18 గంటల కర్ఫ్యూ ఏపీలో కరోనా ప్రభావాన్ని కొంతలో కొంత తగ్గించినా జగన్ వ్యూహం ఫలించినట్లే అవుతుంది.