మసీదులో పేలుడు.. 15 మందికి గాయాలు

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హర్ ప్రావిన్స్‌ ట్రైలీ పట్టణంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో కొందరు గాయపడగా మరి కొందరు మరణించి ఉంటారని తాలిబన్‌ అధికారి తెలిపారు. మసీదు లోపల ఉంచిన బాంబులను పేల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇమామ్ కూడా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.

ఐఎస్‌ఐఎల్‌ (ఐఎస్‌ఐఎస్‌) మిలిటెంట్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడుతున్నది. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనలకు షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే మసీదులను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరుపుతున్నది. అయితే తాజా పేలుడుకు ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/