15 ఎంపీ స్థానాల్లో గెలవాలి

Congress-
Congress-

టీ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల టార్గెట్‌
తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని పిలుపు
హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశం మేరకు ఇప్పటికే ఆ దిశగా టీ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలోని 17 స్థానాలలో కనీసం 15 స్థానాలను చేజిక్కించుకునే విధంగా ఆ పార్టీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలలో ఊహించని విధంగా ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలలోనైనా మెరుగైన ఫలితాలు సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్రంలో ఏకపక్ష, ప్రజా వ్యతిరేక పాలన పాలన సాగిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని సాగనంపి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలంటే ప్రతీ రాష్ట్రంలోనూ అత్యధిక సంఖ్యలో పార్టీ ఎంపీలను గెలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ప్రకటించనప్పటికీ మోడీ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన పెద్ద నోట్ల రద్దు మొదలు జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్‌ మోడీ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని అంటూనే తెలంగాణలో బీజేపీకి బద్ద శత్రువని చెప్పుకునే ఎంఐఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌కు ఓటు వేస్తే అది నేరుగా మోడీని మళ్లీ ప్రధాన మంత్రిని చేయడానికి తోడ్పడుతుందనీ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీని గద్దె దింపాలంటే టీఆర్‌ఎస్‌కు కాకుండా కాంగ్రెస్‌ అభ్యర్థులనే గెలిపించాలని లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేయనుంది. కాగా, గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలన్న రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంతో ప్రజలు కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం వేగంగా నిర్మాణం అవుతున్న సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, వికలాంగుల పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదం చేశాయి. దీనికి తోడు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా అనుసరించిన వ్యూహాలు సైతం ఆయనను మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టేలా చేశాయి. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసిన నేతగా కేసీఆర్‌ను ప్రజలు ఇప్పటికీ అభిమానిస్తున్నారు. అయితే, తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ అయినా, ఇచ్చింది మాత్రం యుపిఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ అనేది నిర్వివాదాంశం. ఇదే విషయాన్ని స్వయంగా కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా ఎన్నో సందర్భాలలో బహిరంగంగానే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో 2014, 2018 ఎన్నికలలో భారీ మెజార్టీ ఇచ్చి సీఎం పీఠంపై కూర్చుండబెట్టారు. అలాగే, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం కూడా తీర్చుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ప్రజలను కోరనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలో కనీసం 15 స్థానాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించడం ద్వారా రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయవచ్చనీ, ఇది తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకున్నట్లు అవుతుందని టీ కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర-దేశ ప్రయోజనాలు వేరనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్‌ను సీఎంను చేసిన ప్రజలు దేశ ప్రయోజనాల కోసం లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు.
సోనియా రుణం తీర్చుకునే సమయం ఇదే : గూడూరు
త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని టీ కాంగ్రెస్‌ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ అయితే, ఇచ్చింది సోనియానేననీ, ఆమె రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేస్తే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వెంటనే జాతీయ హోదాను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన కేసీఆర్‌ విభజన చట్టంలోని హామీలను సైతం సాధించలేక పోయారనీ, కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ సాధించి పెడతామని గూడూరు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.