14కి చేరిన నిఫా వైరస్‌ మృతులు

NIPAH VIRUS
NIPAH VIRUS

కోజికోడ్‌: నిఫావైరస్‌ దేశంలో మరోసారి విజృంభించింది. కేరళలో ఈ వైరస్‌సోకిన మృతులసంఖ్య 14కు పెరిగింది. మరోరెండు కేసులు నమోదయినట్లు కేరళ వైద్యశాఖప్రకటించింది. 22 ఏళ్ల ఆబిన్‌ బేబి మెమోరియల్‌ ఆసుప్రత్రిలో చికిత్సకు చేరాడని, మరో ఇద్దరు నిఫా వైరస్‌సోకిన రోగులు రాష్ట్రంలో ఉండటంతో మరింతగా వ్యాప్తిచెందుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు కలవరం వ్యక్తంచేస్తున్నారు. నిన్నటివరకూ 13కు చేరిన మృతులు సోమవారం మరొకరు మృతిచెందడంతో 14కు పెరిగింది. అంతకుముందు కేంద్ర వైద్యబృందం ఆరోగ్యశాఖకు నివేదిక ఇస్తూ గబ్బిలాలనుంచి పరీక్షలకోసం నమూనాలుసేకరించామని, కోజికోడ్‌, మలాప్పురం జిల్లాల్లో వీటిని పరిశీలిస్తే వైరస్‌లేదని తేలిందని అన్నారు. మొత్తం 21 నమూఐనాలు తీసిన వైద్యబృందం వీటిలో ఏడు నమూనాలను గబ్బిలాలనుంచి రెండునమూనాలు పందులనుంచి, ఒకటి పశుజాతినుంచి మరోటి గొర్రెలు, గొర్రెల కాపరులనుంచి సైతం సేకరించి భోపాల్‌లోని జాతీయ పశువ్యాధుల పరీక్షా కేంద్రం, పూణెలోని నేషనల్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించినట్లు వెల్లడించింది. వీటిలో కోజికోడ్‌ బావినుంచి పట్టిన గబ్బిలాలనుంచి తీసని శాంపిల్స్‌ కూడా ఉన్నాయని, కేరళలోని పెరంబ్రాలో తొలుత ఈ వ్యాధి సంక్రమించిన ప్రాంతంలో కూడా నమూనాలుసేకరించామని, అయితే ఇవన్నీ నిఫావైరస్‌లేదన్న ఫలితాలే వచ్చాయన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు బీహార్‌, సిక్కిమ్‌, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోసైతం హెచ్చరికలుచేసారు. జ్వరం సోకిన కేసులను నిరంతరం పర్యవేక్షించాలని, అనేక ప్రాంతాలు తరచూపర్యటించిన వారిని మరింత నిశితంగాపరిశీలించాలని, ఇటీవల కేరళకు వచ్చినవారిపై మరింత తనిఖీ ఉండాలని ఆదేశించాయి. సిక్కిం ఆరోగ్యశాఖ నిఫావైరస్‌ సోకే ప్రమాదం లేకపోయినప్పటికీ ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా పక్షలు, గబ్బిలాలు ఇతర జంతువులు తిన్న పండ్లను సేవించవద్దని హెచ్చరించింది. జంతువులనుంచి, ఇతర పక్షిజాతులనుంచి సోకినట్లుగా భావిస్తున్న నిఫావైరస్‌పై కేరళతోపాటు దక్షిణాదిరాష్ట్రాలు ఇతర ప్రాంతాలు సైతం అప్రమత్తం అయ్యాయి. నిఫా వైరస్‌ కట్టడికి ప్రస్తుతం ఎలాంటి ఔషధాలులేవు. కేవలం వ్యాధి ముదిరిపోకుండా మాత్రమే చికిత్సచేసేందుకు వీలుంటుందని వైద్యనిపుణులు చెపుతున్నారు.