అసోంలో ఘోరం : పుట్ట‌గొడుగులు తిని 13 మంది మృతి

అసోంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవిలో దొరికే విషపూరితమైన పుట్టగొడుగులు తిని 13 మంది చనిపోయారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. మ‌రో 39 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో మృత్యువాత ప‌డ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఎగువ జిల్లాలైన చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, టిన్సుకియా ప్రాంతాల్లో పుట్టగొడుగులు తిన్న వ్యక్తులు అస్వస్థతకు గురైనట్లు అసోం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత డిహింగియా తెలిపారు. ఐదు రోజుల్లో 35 మంది ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.

35 మందిలో 13 మంది చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అందులో నలుగురు సోమవారం, తొమ్మిదిమంది మంగళవారం చనిపోయారని తెలిపారు. మృతి చెందిన వారిలో చరైడియా జిల్లాలోని సోనారి ప్రాంతానికి చెందిన చిన్నారి కూడా ఉంది. అలాగే దిబ్రూఘర్ జిల్లాలో బార్బరువా ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉన్నారు. అదేవిధంగా శివసాగర్ జిల్లాలకు చెందిన వ్యక్తి ఒకరున్నారు అని తెలిపారు. వీరంతా కూడా అడవిలో దొరికే విషపూరితమైన పుట్ట గొడుగులను తినడం వల్ల ఇలా జరిగిందని, వాటిని తిన్నాక అందరిలో కడుపునొప్పి, వాంతులు, వికారం మొదలై ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.