శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి : మెట్లబావి ఫ్లోరింగ్ కూలిన ఘటన లో 35 మంది మృతి

దేశ వ్యాప్తంగా నిన్న శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఉదయం నుండే అన్ని దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. కాగా కొన్ని చోట్ల మాత్రం నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వాటిలో మధ్యప్రదేశ్ ఇండోర్ లోని భలేశ్వర్ మహదేవ్ మందిర్ లో 50 అడుగుల బావిపై కప్పు కూలిన ఘటన లో 35 మంది చనిపోయారు. శ్రీ బాలేశ్వర్ ఆలయంలో నిన్న శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయంలోని పురాతన మెట్ల బావిని మూసివేస్తూ నిర్మించిన ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 35 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రంగా గాయపడిన మరో 19 మందిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆలయంలో మెట్లబావిని మూసివేస్తూ నిర్మించిన ఫ్లోరింగ్‌పై దాదాపు 50 మంది భక్తులు కూర్చోవడంతో బరువును మోయలేక ఫ్లోరింగ్ కుప్పకూలింది. దీంతో 50 అడుగుల లోతున్న బావిలో వారంతా పడిపోయారు. అక్కడున్నవారు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ లోతు ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా బావిలోకి దిగి 11 మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో 10 మంది మహిళలే కావడం గమనార్హం. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.