రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌..వాళ్లు ఎవరంటే

రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌..వాళ్లు ఎవరంటే

సోమవారం నుండి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభ మొదలైనప్పటినుండి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. ఈ క్రమంలో రాజ్య సభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర కోపానికి గురయ్యారు. ఈ క్రమంలో రాజ్య సభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేశారు. సస్ఫెన్షన్‌ చేయడమే కాకుండా… రాజ్య సభను రేపటికి వాయిదా వేశారు.

సస్పెన్షన్‌ కు గురైన ఎంపీలు ఎవరంటే.. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం – సీపీఐ, డోలా సేన్ & శాంత ఛత్రీ – టీఎంసీ, ప్రియాంక చతుర్వేది & అనిల్ దేశాయ్ – శివసేన లతో పాటు కాంగ్రెస్ కు చెందిన ఫూలో దేవి నేతమ్, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ లను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ తెలిపారు.

మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్​సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు ఆందోళనలు అలాగే కొనసాగించారు. దీంతో మంగళవారానికి వాయిదా వేశారు.