మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ..టీఎంసీ లోకి మాజీ సీఎం

కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే గత కొంతకాలంగా అధికారం లేక ప్రజల్లో నమ్మకం నిలుపోకోలేక ఇబ్బందులు పడుతున్న పార్టీ కి..ఇప్పుడు సొంత పార్టీ నేతలు షాక్ లు ఇస్తున్నారు. పార్టీ కి రాజీనామా చేసి , టీఎంసీ లో చేరబోతున్నట్లు ప్రకటిస్తున్నారు.

మేఘాలయలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్‌ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలిచారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మేఘాలయ మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా తన అనచరులు 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసారు. త్వరలోనే టీఎంసీ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌కు లేఖ రాసారు. 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ వర్గాలు కూడా వెల్లడించారు. దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది. వరుసుగా మూడోసారి బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకుని ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యూహంలో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌, రాహుల్‌ గాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన అశోక్‌ తన్వర్‌లు మమతా బెనర్జీ సమక్షంలో ఆపార్టీలో చేరారు. గత సెప్టెంబర్‌లో గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ బలమైన నేత లుజినో ఫలైరో తృణమూల్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా టీఎంసీలో చేరారు. వచ్చే ఏడాది గోవాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ బలాన్ని పెంచే దిశగా మమత బెనర్జీ అడుగులు వేస్తున్నారు.