ఘోర ప్ర‌మాదం.. ఫ్యాక్ట‌రీ గోడ కూలి 12 మంది మృతి

ఘటనపై ప్ర‌ధాని మోడీ తీవ్ర దిగ్ర్భాంతి

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్‌లోని మోర్బి జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. హ‌ల్వాడ్‌లోని సాగ‌ర్ ఉప్పు ఫ్యాక్ట‌రీ గోడ కూలి.. 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శిథిలాల తొల‌గింపు కొన‌సాగుతోంది. శిథిలాల కింద మరికొంద‌రు చిక్కుకున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని గుజ‌రాత్ మంత్రి బ్రిజేష్ మెర్జా పేర్కొన్నారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున, క్ష‌త‌గాత్రుల‌కు రూ. 50 వేల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/