భారత్‌కు చేరుకున్న మరో 12 చీతాలు

సౌతాఫ్రికా నుంచి గ్వాలియర్‌ చేరుకున్న ప్రత్యేక విమానం

12-cheetahs-to-reach-gwalior-from-south-africa-10-am-today

న్యూఢిల్లీః మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లోకి మరో 12 చీతాలు రాబోతున్నాయి. దేశంలో అంతరించి పోయిన చీతాల జాతిని పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌతాఫ్రికా నుంచి ఈ చీతాలను తెప్పించింది. సౌతాఫ్రికా నుంచి చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్వాలియర్ లో దిగింది. అక్కడి నుంచి అధికారులు వీటిని హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. ప్రస్తుతం వచ్చిన చీతాలలో ఏడు మగ చీతాలు కాగా, ఐదు ఆడ చీతాలని అధికారులు తెలిపారు.

పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ఎన్ క్లోజర్లలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని విడుదల చేస్తారు. ఈ ఎన్ క్లోజర్లలో చీతాలను 30 రోజుల పాటు ఉంచి పరిశీలించనున్నట్లు అధికారులు చెప్పారు. అనంతరం వాటిని మరో ప్రత్యేక ఎన్ క్లోజర్ లోకి మార్చుతామని చెప్పారు.

కాగా, గతేడాది సెప్టెంబర్ లో ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న వాటిని కూనో నేషనల్ పార్క్ లోని ప్రత్యేక ఎన్ క్లోజర్లలోకి ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ చీతాలను పార్క్ అధికారులు హంటింగ్ ఎన్ క్లోజర్లలో ఉంచారు.