100 శాతం అక్యుపెన్సీతో థియేటర్లు.. ఎక్కడంటే?

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా చాలా రోజులు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వాలు ఇటీవల కరోనా నిబంధనలను సవరిస్తూ వస్తున్నాయి. అయితే సినిమా రంగానికి మాత్రం ఇంకా పూర్తి సవరణలను రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీ ఇంకా నష్టాల నుండి కోలుకోలేకపోతుంది. యావత్ భారతదేశంలో ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే 50 శాతం అక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక కొత్త సినిమాలు రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా, 100 శాతం అక్యుపెన్సీకి అనుమతించాలని పలు రాష్ట్రాల్లో డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఎలాంటి రచ్చ సాగుతుందో అందరికీ విదితమే. కాగా తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 26వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని (కెఐఎఫ్ఎఫ్) ప్రారంభించిన ఆమె ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు.

దీంతో ఇతర రాష్ట్రాల థియేటర్ యాజమాన్యాలు కూడా 100 శాతం అక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా మమతా బెనర్జి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీసింది. అయితే కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించేలా థియేటర్ల యాజమాన్యాలు చూసుకోవాలని ఆమె తెలిపారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు ఇప్పటికే 50 శాతం అక్యుపెన్సీతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.