తాగి దొరికితే పదేళ్లు ఖతం!

ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా మందుబాబులు మాత్రం వాటిని పెడచెవిన పెడుతూ వస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు రెడీ అయ్యారు. అసలే న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో తెలంగాణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి ముందే వార్నింగ్ ఇస్తున్నారు.

ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇకమీదట డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వారిని కనీసం పదేళ్లు జైలుకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే వారిపై ఐపీసీ 304 కింద కేసు నమోదు చేసి జైలుపాలు చేస్తామని ఆయన అన్నారు. కాగా సోమవారం ఒక్కరోజు సైబరాబాద్ పరిధిలో ఏకంగా 402 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారని ఆయన వెల్లడించారు.

అయితే కొంత కాలంగా కరోనా కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేసిన పోలీసులు, తాజాగా మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని, తాగి బండి ఎక్కితే అంతే సంగతులు అంటూ సజ్జనార్ హెచ్చరించారు. ఇక కరోనా వ్యాప్తి కారణంగా సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా మందుబాబులు మందు తాగి వాహనం నడిపితే పదేళ్లు కటకటాలపాలు కావడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.