ఫ్లోరిడాలో తుపాకుల మోత..10 మందికి తీవ్ర గాయాలు

అమెరికా లో తుపాకుల మోత ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట తుపాకుల కాల్పులతో నానా బీబత్సం సృష్టిస్తున్నారు. గతవారం లాస్ ఏంజెలెస్ లోని మాంటెరీ పార్కు నగరంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలపై జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు ఫ్లోరిడాలో జరిపిన కాల్పుల్లో పదిమంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.

డార్క్ బ్లూ కలర్ నిస్సాన్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కిటికీ అద్దాలను దించి వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కారులో నుంచే వారు కాల్పులకు పాల్పడ్డారని, నిందితులందరూ పురుషులేనని నిర్దారించారు. గాయపడిన వారిలో ముగ్గురిని మాత్రమే అత్యవసర చికిత్సకు తరలించినట్టు తెలిపారు. ముఖాలు కనిపించకుండా కప్పుకుని కాల్పులకు దిగిన దుండగుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని, కనీసం 10 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు లేక్‌ల్యాండ్ పోలీసు విభాగం నిర్ధారించింది.