10 శాతం వృద్ధిరేటు పెనుసవాలే

Arun jaitly
Arun jaitly

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక ఫండమెంటల్స్‌ మెరుగుపడిన నేపథ్యంలో భారతదేశం తిరిగి 7-8 శాతం వృద్ధిరేటును నమోదు చేయడానికి సిద్ధమైందని, రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం చెప్పారు. భారతదేశం ఇప్పుడు నిలకడగా 7-8 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ వృద్ధిరేటు మందగిస్తే అది ఏడు శాతానికి, వేగం పుంజుకంటే ఎనిమిది శాతానికి చేరుకుంటుంది. జిడిపి లెక్కలో చూస్తే దేశం ఇప్పటికే 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారైంది అని జైట్లీ గురువారం ఢిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ప్రసంగిస్తూ చెప్పారు. ఆయన తన ప్రసంగంలో జిడిపి వృద్ధి మొదలుకొని జిఎస్‌టి దాకా అనేక అంశాలను ప్రస్తావించారు. గత మూడేళ్లుగా భారతదేశం సగటున ఏడు శాతం చొప్పున వృద్ధి నమోదు చేస్తూ వస్తోంది. ఇది మంచి వృద్ధే అయితే 10 శాతం వృద్ధిరేటుకు చేరుకోవాలంటే పెనుసవాలేనని ఎందుకంటే అది కేవలం దేశీయ అంశాలపైనే ఆధారపడి ఉండదని ప్రపంచ పోకడలపైనా కూడా ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. రెండెంకెల వృద్ధిరేటును చేరుకోవాలంటే బూమ్‌ సమయం ఉండాలని ఆయన అన్నారు. దేశంలో మౌలిక సదుపాయల రంగానికి భారీగా నిధులు అవసరమని ఆయన అంటూ రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమన్నారు. దేశంలో పెద్ద సవాలు ఏమిటంటే మౌలిక సదుపాయల కల్పన అని ఎందుకంటే భారతదేశం చాలావరకు పన్నుల చెల్లించని సమాజమని ఆయన అన్నారు. 2007-17 మధ్య కాలంలో మౌలిక సదుపాయాలపై 60 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగిందని, ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ రంగంలో వ్యయాన్ని గణనీయంగా పెంచిందని జైట్లీ చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.3.96 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) గురించి మాట్లాడుతూ ఇంతకు ముందు దేశంలో 31 శాతం పన్ను రేటు ఉండేదని దాన్ని తాము తాత్కాలికంగా 28 శాతానికి తగ్గించామని,ఇప్పుడు గడువు కన్నా ముందే దాన్ని హేతుబద్దం చేయడం మొదలుపెట్టామని చెప్పారు. భవిష్యత్తులో జిఎస్‌టి రేట్లను మరింత హేతుబద్ధం చేయడం అనేది రెవిన్యూ వసూళ్లపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. 28 శాతం జిఎస్‌టి శ్లాబు కింద ఉండే వస్తువుల సంఖ్య పరిమితంగానే ఉంటుందని, లగ్జరీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించకుండా ఉండేలా ఉంటుందని ఆయన అంటూ జిఎస్‌టి రేట్లను హేతుబద్ధం చేయడం ద్వారా ద్రవ్యోల్భణం ఒత్తిడిని దూరం చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా ఆయన తెలిపారు. మొదట్లోనే ప్రభుత్వం తక్కువ జిఎస్‌టి రేట్లను నిర్ణయించి ఉంటే ద్రవ్యోల్భణం ప్రభావం కూడా ఉండేదని జైట్లీ అభిప్రాయపడ్డారు. దేశం ఇప్పుడు రెండెంకెల ద్రవ్యోల్భణం ఉండే పాత రోజుల నుంచి దూరమైందని జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్భణాన్ని నాలుగు శాతానికి పరిమితం చేయాలన్నది మా లక్ష్యం. కరెంటు ఖాతా లోటును అదుపులోనే ఉంచగలిగాం. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా దేశం ఆర్థికలోటును సైతం తగ్గించగలిగింది అని ఆయన అన్నారు. ఈ అన్ని అంశాల మొత్తం ప్రభావం కారణంగా దేశం తన సొంత వనరులపైనే ఎక్కువగా ఆధారపడగలిగే, బయటి నుంచి తక్కువ అప్పులు తీసుకునే స్థితికి దాదాపుగా చేరుకుంటోందని ఆయన అన్నారు. ప్రతి ప్రభుత్వ సంస్కరణలకు ఒక నిర్ధిష్టమైన దిశ ఉంటుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా కాకుండా భారతదేశం ఉపాధి కల్పన కోసం ఎక్కుకగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అవ్యవస్థీకృత రంగంపై ఆధారపడి ఉందని అందువల్ల ప్రభుత్వం సైతం ఈ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. గ్రామీణ భారతం మౌలిక సదుపాయాలపైనా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని అందువల్ల ఈ రంగాలలో మరింత ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు.