లిబర్టీ చౌరస్తా వద్ద రూ. కోటి 27 లక్షలు నగదు స్వాధీనం

రేపు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో లిబర్టీ చౌరస్తా వద్ద రూ. కోటి 27 లక్షలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు వెళ్లే రూట్లలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు రూ. కోటి 27 లక్షలు నగదు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ద్విచక్రవాహానాన్ని వెంబడించారు. లిబర్టీ చౌరస్తాలో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద భారీ ఎత్తున నగదు లభ్యమైంది. గోల్నాకలో నివాసముండే మన్నే శ్రీనివాస్‌,ఉస్మాన్‌గంజ్‌కు చెందిన విశ్వత్‌శెట్టి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఫణికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

మునుగోడు నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పటు చేస్తున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్న ఆయన.. చెక్‌ పోస్టులు గురువారం ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయని స్పష్టం చేశారు.