1.16 లక్షలమందికి ఐటి నోటీసులు!

Income Tax
Income Tax

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్ను శాఖ సుమారు 1.16 లక్షల మందికి నోటీసులు జారీచేసింది. కొందరు ప్రముఖులతో పాటు కొన్ని
సంస్థలకు సైతం ఈ నోటీసులు వెళ్లాయి. వారంతా తమత బ్యాంకు ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.25 లక్షలు అంతకు పై బడిన మొత్తాలు
జమచేసినట్లు కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర వెల్లడించారు. ఈ భారీ మొత్తం జమలతోపాటు వారు దాఖలుచేసిన ఐటి రిటర్నులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. పన్నులశాఖ ఇప్పటివరకూ చూస్తే 18 లక్షల మందికి నోటీసులు జారీచేసింది. బ్యాంకు ఖాతాల్లో 2.5 లక్షలకు మించి డిపాజిట్‌చేసిన అన్ని ఖాతాలను ఐటిశాఖ పరిశీలనకు ఉపక్రమించింది. ఇందులోభాగంగానే ఈ నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా వ్యక్తులు, సంస్థలు ఇప్పటివరకూ ఐటి రిటర్నులు దాఖలు చేయనివారిని కూడా విభజించింది. రెండుకేటగిరీలుగా విభజించి ఎవరైనా రూ.25 లక్షలకుమించి బ్యాంకు ఖాతాల్లో జమచేసినా, లేక రూ.10-25 లక్షలవరకూ జమచేసి ఇప్పటివరకూ రిటర్నులు దాఖలు చేయకపోయినా వారినిసైతం పరిగణనలోనికి తీసుకుంటున్నది. రెండో దశలో వీరందరికీ నోటీసులు జారీచేస్తున్నట్లు వెల్లడించింది. ఈనోటీసులు ఐటి చట్టం సెక్షన్‌ 142(1)పరిధిలో జారీచేస్తున్నట్లు సుశీల్‌చంద్ర వెల్లడించారు. ఐటి చట్టాలను ఉల్లంఘించిన వారిని ప్రాసిక్యూషన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఖ్య ఏప్రిల్‌నుంచి సెప్టెంబరు వరకూ ఈ ఏడాది 288 నుంచి 609 మందికి పెరిగింది. మొత్తం ఫిర్యాదులు 652 నుంచి 1046కు పెరిగినట్లు సిబిడిటి ఛైర్మన్‌ వెల్లడించారు. అలాగే గత ఏడాది 13 మందికి న్యాయస్థానాల్లో శిక్షలు పడితే ఈ ఏడాది ఈ సంఖ్య 43 మందికి పెరిగిందని చంద్ర వివరించారు. అధికారిక గణాంకాలప్రకారం మొత్తం 17.73 లక్షల సందేహాస్పద కేసులు ఉన్నాయని, వీటిలో రూ.3.68 లక్షల కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. మొత్తం 23.22 లక్షల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయినట్లుతేలిందని సిబిడిటిఛైర్మన్‌ లెల్లడించారు. 16.92 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించి 11.8 లక్షల మందినుంచి నోటీసులకు సరైన వివరణలు ఆన్‌లైన్‌లోనే వచ్చాయన్నారు.