హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన

హైదరాబాద్ నగరం మరోసారి తడిసి ముద్దవుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష భీభత్సం కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజగుట్ట , ఉప్పల్‌ ఎల్‌బీనగర్‌, కోఠి, హిమాయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్‌, కూకట్‌పల్లి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఫిలీంనగర్‌లో బస్తీ నీటమునిగింది. వీకెండ్ కావడం తో నగరవాసులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. ఈ క్రమంలో వర్షం దంచి కొడుతుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ తరుణంలో అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. ఈ మేరకు డీఆర్‌ఎఫ్‌ను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ.. అవసరమైతే కంట్రోల్‌ రూం నెంబర్‌ 040-29555500ను సంప్రదించాలని తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రా‍ల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ‘గులాబ్‌’గా పేరుపెట్టిన ఈ తుపాను ఆదివారం సాయంత్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ మధ్య తీరం దాటవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒడిశా, ఏపీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విశాఖపట్నం నుంచి గోపాల్‌పూర్‌ వరకు ఉన్న తీర ప్రాంతాలపై ఇది ప్రభావం చూపవచ్చని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.