సిద్దిపేటలో పామాయిల్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాట్లు చేస్తాం..హరీష్‌

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ప‌ట్ట‌ణం రెడ్డి ఫంక్ష‌న్ హాల్‌లో జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ రోజా రాధాకృష్ణ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన మంత్రి మాట్లాడుతూ.. పామాయిల్ సాగుతో రైతుల‌కు సుస్థిర ఆదాయం ల‌భిస్తుంద‌ని అన్నారు. జిల్లాలో 50 వేల ఎక‌రాల్లో పామాయిల్ సాగు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.
క‌ర‌ప‌త్రాల‌తో పాటు బ‌హుళ ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా పామాయిల్ సాగు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను రైతుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. ఈ సాగుకు చీడ‌, పీడ‌ల బెడ‌ద ఉండ‌దు.. అట‌వీ జంతువుల బాధ‌లు కూడా ఉండ‌వ‌ని చెప్పారు. అంత‌ర పంట‌ల‌కు సాగుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఈ పంట‌ను సాగు చేసే రైతుల‌కు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వం రాయితీలు క‌ల్పిస్తుంద‌న్నారు. పామాయిల్ పంట సాగుతో పాటు ప‌ట్టు పురుగుల పెంప‌కంతో రైతుల‌కు అధిక ఆదాయం స‌మ‌కూరుతుంద‌న్నారు. ఈ రెండు పంట‌ల పెంప‌కంను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించేందుకు ముందుకు వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిదులు, రైతుల‌కు ఖ‌మ్మం జిల్లా, క‌ర్ణాటక రాష్ర్టానికి విజ్ఞాన యాత్ర‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. పంట క‌ల్లాల‌కు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన పూర్తి ల‌క్ష్యం సాధించాలి. పంట క‌ల్లాల నిర్మాణ ప్ర‌గ‌తిపై ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు క్షేత్ర స్థాయిలో స‌మీక్షించాల‌ని మంత్రి హ‌రీష్ రావు ఆదేశించారు.