సింగర్‌ అవతారం!

NANDAMURI BALAKRISHNA
NANDAMURI BALAKRISHNA

సింగర్‌ అవతారం!

నందమూరి బాలకష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు. వంద చిత్రాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 101వ సినిమా చేస్తున్న ఆయన తనలోని ఈ కొత్త కోణాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని వి.ఆనందప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో జరిగింది. గురువారం సాయంత్రం చిత్ర యూనిట్‌ పోర్చుగల్‌కు ప్రయాణమయ్యింది. అక్కడ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. బాలకష్ణగారు ఈ చిత్రంలో మావా ఏక్‌ పెగ్‌ లావో.. అనే పాట పాడటం చాలా ఆనందంగా ఉంది. అనూప్‌ వినసొంపైన పాటను స్వరపరిచారు.

ఆ గీతాన్ని బాలకష్ణగారు చాలా హుందాగా, హుషారుగా పాడారు. ఆయన పాడిన పాట వింటే ప్రొఫెషనల్‌ సింగర్‌ పాడినట్టు అనిపించింది. అత్యంత తక్కువ సమయంలో అంత గొప్పగా పాడటాన్ని చూసి మా యూనిట్‌ ఆశ్చర్యపోయాం. స్వతహాగా బాలకష్ణగారికి సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంది. గాయకుడిగానూ ఆయనలో గొప్ప ప్రతిభ దాగి ఉందన్న విషయం ఇప్పుడు రుజువైంది. ఆడియో విడుదలైన తర్వాత పాటను విన్న ప్రతి ఒక్కరూ ఆయన స్వరాన్ని విని ఆనందిస్తారు. అభినందిస్తారు అని అన్నారు. నిర్మాత వి.ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ.. బాలయ్యగారి 101వ చిత్రాన్ని మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాం. ఈ చిత్రానికి వేల్యూ అడిషన్‌ బాలయ్యగారి స్వరం. ఆయన పాడటానికి ఒప్పుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. తప్పకుండా అందరూ ఎంజా§్‌ు చేసేలాగా అనూప్‌ చక్కటి బాణీ ఇచ్చారు. భాస్కరభట్ల మంచి లిరిక్స్‌ ను అందించారు.

ఇప్పటికే షూటింగ్‌ కొంత భాగం పూర్తయింది. గురువారం సాయంత్రం మా యూనిట్‌ అంతా పోర్చుగల్‌కు ప్రయాణమయ్యింది. అక్కడ 40 రోజుల పాటు కీలక సన్నివేశాలను, పాటలను, యాక్షన్‌ ఎపిసోడ్‌లను చిత్రీకరిస్తాం. దసరా కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ.. నందమూరి బాలకష్ణసార్‌లాంటి ఓ లెజెండరీ హీరో నేను స్వరపరిచిన పాటను, ఆయన తొలి పాటగా పాడటం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాడుతున్నంత సేపు చాలా ప్రొఫెషనల్‌ సింగర్‌లాగా అనిపించారు. చాలా తక్కువ సమయంలో పాడారు అని అన్నారు.