సంక్రాంతి తర్వాత తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ..?

తెలంగాణ లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కొత్త కేసులు వేలు దాటుతున్నాయి. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి చర్యలు కఠినతరం చేయబోతుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన సర్కార్..ఇక సంక్రాంతి తర్వాత మరిన్ని ఆంక్షలను కఠినతరం చేయాలనీ చూస్తుంది. ఈ క్రమంలో అధికారుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిక కోరారు. ప్రస్తుతం రోజుకు 2500 పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా తీవ్రత, నియంత్రణపై ఈరోజు కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. కేసుల తీవ్రత, మరణాల సంఖ్య పెరిగితే ఆంక్షలు తప్పవని.. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. అలాగే బార్లు, పబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఈరోజు జరిగే సమీక్షా తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది.

ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,295 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 64,474 పరీక్షలు చేయగా 2 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కరోజే 1452 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 218, మేడ్చల్ జిల్లాలో 232 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో 24 గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.