విలాసాలు కాదు.. అవసరాలు తీర్చండి

పిల్లలు ఏదైనా ఓ మంచి పనిచేస్తే ప్రశం సించండి. ఏదైనా ఓ బహుమతివ్వండి. అది కూడా ప్రోత్సహించే రీతిలోనే సుమా! అంతేకానీ, వారేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు కాదు.

FAMILY
FAMILY

శరత్‌, కావ్య ఇద్దరూ ఉద్యోగస్తులే. పైగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికి నెల వచ్చేసరికి అక్షరాలా లక్షాయాభైవేలు వస్తుంది. వారికి ఇద్దరు పిల్లలు. కానీ వారితో గడిపే సమయం తక్కువ. వారిద్దరూ జాగ్రత్తగా వ్ఞండాలనే తపన అందరి తల్లిదండ్రుల్లాగానే శరత్‌, కావ్యలకు ఉంది. దీంతో వారికి ఇంట్లోనే అన్ని సమకూర్చారు. ల్యాప్‌టాప్‌, టివి, కంప్యూటర్‌ ఇలా వారు అడిగినవన్నీ కొనిచ్చారు. మంచి తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైనవాటినే కొనిస్తారు. వారు కోరినవన్నీ కొనిచ్చే పేరెంట్స్‌ సరైనవారు కారు. ఎందుకంటే పిల్లల కోరికల్ని బట్టి మనం కొనివ్వడం సరైంది కాదు. వారికి ఏది అవసరమో దాన్నే ఇవ్వాలి. అంతేకాదు అది వారి ఉజ్వల భవితకు తోర్పడేలా ఉండాలి. సమాజంలో వారు బాధ్యతాయుతంగా మెలిగేలా, తద్వారా సమాజాభివృద్ధికి తమవంతు కృషిచేసేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నేటి తల్లిదండ్రులు ఒకరిద్దరితో సరిపుచ్చుకుంటున్నారు. చిన్నకుటుంబాలు ఏర్పడి, పిల్లలే తమ లోకంగా జీవిస్తున్నారు. తద్వారా వారికి ఏ కష్టం రాకూడదని, తమలాగా బాధపడకూడదని భావిస్తూ అతి గారభంతో వారు కోరినవన్నీ కొనిస్తుంటారు. పిల్లల నోట్లో ఇలా వచ్చిందో లేదో కొనివ్వడమే తమ కర్తవ్యంగా భావించే అమ్మానాన్నలు లేకపోలేదు. ఇలా చిన్నవయసులోనే వారిని విలాసవంతమైన జీవితానికి అలవాటు చేస్తున్నారు. ఇది కూడా సరైంది కాదు. ఇలా కొనివ్వడానికి కూడా కారణాలు లేకపోలేదు. దంపతులిద్దరూ ఉద్యోగాల్లో పడి పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం తదితర కారణాలతో తమకు తెలియకుండానే గిల్టీగా ఫీలవ్ఞతుంటారు. పిల్లలను సరిగా చూడలేకపోతున్నామనే భావన వారిని ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారించేలా చేస్తుంది. వాటిలో ఒకటి ఈ డబ్బు ఇవ్వడం, అడగంగానే కాదనకుండా వారి గొంతెమ్మకోరికలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం లాంటి సదుపాయాలను సమకూర్చడం మొదలుపెడతారు. దీంతో, పిల్లల్లో ఓ ధీమా పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ అవసరాలు తీర్చడం కోసమే ఉన్నారనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఇలాంటి ధోరణి పెరగకుండా చూడాలి.
కుటుంబ అవసరాల కోసం ఏటిఎం నుంచి డబ్బును తీసుకోడం, చెక్కులు ఇవ్వడం, బ్యాంకు లావాదేవీలు లాంటివన్నీ ఈ రోజుల్లో పిల్లలు చిన్న వయసు నుంచే చూస్తున్నారు. దాంతో తల్లిదండ్రుల వద్ద ఎంతో డబ్బుందని భావిస్తారు. పర్యవసానం చూసిందల్లా కావాలనే మంకుపట్టు. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు డబ్బు విలువ తెలియచెప్పాలి.
తామెంత కష్టపడితే డబ్బు వస్తోందో అర్థమయ్యేలా చెప్పాలి.
క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు ఉంటే చాలు ఏమైనా కొనవచ్చని అపోహను పిల్లల్లో నుంచి తొలగించాలి.
పిల్లలు ఏదైనా ఓ మంచి పనిచేస్తే ప్రశంసించండి. ఏదైనా ఓ బహుమతివ్వండి. అది కూడా ప్రోత్సహించే రీతిలోనే సుమా! అంతేకానీ, వారేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు అస్తమానం వారిని పొగిడితే, వారిలో మితిమీరిన ఆత్మవిశ్వాసానికి మీరే నారు పోసినవారవ్ఞతారు.
అవసరాలకు తగినట్లుగా పిల్లలకు డబ్బును ఇవ్వండి. అలాగే, ఏవిధంగా ఖర్చుపెడుతున్నారో తెలివిగా తెలుసుకోండి. ఖర్చులన్నిటిని ఓ పుస్తకంలో రాయమని చెప్పండి. పిల్లలకోసం కొంత సమయాన్ని వెచ్చించండి. మీరు బిజీగా ఉంటే… పిల్లలు తమకు కాలక్షేపంగా ఆట వస్తువ్ఞలను ఎంచుకుంటారు. అందుకే వారితో కలిసి ఆడటం, స్కూలు విషయాలు తెలుసుకోవడం, వాకింగ్‌ లాంటివన్నీ తప్పనిసరి. మీలో వారు తల్లిదండ్రులనే కాదు, స్నేహితులను చూసుకోవాలి. అప్పుడే వారిలో మీ పట్ల అచంచల విశ్వాసం. భద్రతా భావమూ పెరిగి తమలో ఉన్న అన్ని రకాల భావాలనూ మీతో పంచుకోగలుగుతారు. లేకపోతే వారి భావాలను వేరొకరితో చెప్పినప్పుడు మీరు బాధపడవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి రానివ్వకపోవడమే మీకు, మీ అమ్మాయికి మంచిది. ముందు నుంచీ అడిగిందల్లా ఇవ్వడం అలవాటు చేసి
ఎప్పుడైనా కుదరదు అన్నారను కోండి. ఇక అంతే… కొందరు అలుగుతారు. అన్నం మానేస్తారు. మరికొందరు అసహనం ప్రదర్శిస్తారు. అందినవి పగల కొట్టేస్తారు. ఇంకొందరు నిరుత్సాహపడి ఈ మధ్య అమ్మా,నాన్న ఎందుకో తనను పట్టించుకోవడం లేదనుకుని కుంగిపోతారు. మానసికంగా చాలా డిస్టర్బ్‌ అయ్యి చదువ్ఞ మీద శ్రద్ధ చూపలేరు. అందుకే వారేదైనా అడిగితే, ఆఘమేఘాలపై సమకూర్చకండి. సకాలంలో వారికి అందేలా చూడండి చాలు. అప్పుడే వారికి సహనం అలవడుతుంది. ఇతరులకు సాయం చేసే ధోరణులను చిన్నతనం నుంచే నేర్పాలి. వారిచేతే చిన్నచిన్న సేవలు చేయించడం, వారికి నచ్చని దుస్తులను, అవసరమైన వారికి ఇవ్వమని చెప్పడం, ఎదుటివారితో తమ వస్తువ్ఞలను, బొమ్మలను పంచుకునేలా ప్రోత్సహించడం, తదితర చర్యలన్నీ పిల్లలో సేవాభావాన్ని పెంచేవే. అంతేకాకుండా మీకున్న ఖాళీ సమయంలో ఒకసారి వాళ్లను అనాథాశ్రమాలకు తీసుకెళ్లి అక్కడి పిల్లలతో గడిపి, వారిచేత పండ్లు, బట్టలు ఇచ్చేటట్లుగా చేస్తే అటువంటి వారిని ఆదుకోవాలనే ఆలోచన ఆ చిన్ని మనసులో ఏర్పడుతుంది. ఇలాంటివి పెద్దలు అలవాటు చేస్తేనే పిల్లలు నేర్చుకునేది. పిల్లలకు చెప్పడమెందుకని తేలిగ్గా తీసుకోకుండా వయసును బట్టి మీ ఉద్యోగాలు, కుటుంబ ఆదాయం, భవిష్యత్‌ అవసరాలు, ఖర్చులు వంటి వాటిపై చర్చించాలి. అపుడు వారికి కుటుంబ ఆదాయ, వ్యయాలపై చిన్నప్పటి నుంచే అవగాహన ఏర్పడి దుబారా ఖర్చులకు దూరంగా ఉంటారు. మిమ్మల్ని అనవసర వస్తువ్ఞలు కొనమని అడగరు. షాపుకు పిల్లల్ని తీసుకెళ్లినప్పుడు సహజంగా వారు చూసిన వాటిని అడిగేస్తుంటారు. అందరిముందూ కావాలని మారాం చేస్తుంటారు. మనం వద్దని చెబితే బాగుండదు. కాబట్టి ఇంట్లోనే షాపింగ్‌కు వెళ్లేముందుకు చెప్పాలి. ఎందుకోసం వెళ్తున్నాం, అవసరమైన వస్తువ్ఞల కోసం తప్ప టైమ్‌పాస్‌ కోసం కాదని, అనవసరమైన వాటిని అడగవద్దని ప్రేమతో వారు అర్థం చేసుకునేలా చెప్పాలి. అంతేకాదు అవసరం అయితే తప్పకుండా కొనిస్తామని చెప్పాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/