లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ

వెల్గటూరు: రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూరు ఎంపీడీఓ కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు రూ.31,03లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, ఎంపీపీ ముస్కు కవిత, పాక్స్‌ చైర్మన్‌ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు సిఎం కెసిఆర్‌ ఆలోచనల్లో నుంచి పుట్టాయని, నిరుపేద ఆడపడుచులకు పెద్దన్నలా అండగా ఉంటున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి పథకంతో పెద్దింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.100,116 ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో మహిళ సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగించుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలువాలని పిలుపునిచ్చారు.