రాష్ట్ర వ్యాప్తంగా 1,47,391 మంది బైండోవర్‌

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి

ap dgp gowtham sawang hd images
ap dgp gowtham sawang hd images

Amaravati పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,47,391 మందిని బైండోవర్‌ చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

నాలుగు విడతల్లో 30,205 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో సున్నితమైనవి 8,555, అత్యంత సున్నితమైనవి 6,254 ఉన్నాయని తెలిపారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 983 కేంద్రాలున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే నేరాలకు సంబంధించి 2013లో 87 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 44కే పరిమితమైంది. ఈ కేసుల్లో 272 మంది నిందితులుగా ఉన్నారని తెలిపారు.

వీరిలో 124 మందిని అరెస్టు చేశామని రెండు హత్యాయత్నాల ఘటనలు చోటుచేసుకున్నాయని’ వివరించారు.

తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుపై ప్రశ్నించగా… ‘ఆయన సర్పంచి బరిలో ఉన్న అభ్యర్థికి ఫోన్‌ చేసి బెదిరించారు. ఆ తర్వాత ఆ అభ్యర్థిపై దాడి జరిగింది’ అని డీజీపీ సమాధానమిచ్చారు.

వైకాపా మద్దతుదారులకు అనుకూలంగా కొందరు ఎస్సైలు, సీఐలు గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన అభ్యర్థులను, మద్దతుదారుల్ని బెదిరిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయని చెప్పగా… అలాంటి ఘటనలు ఎక్కడ జరిగాయో నిర్దిష్టంగా చెప్పాలన్నారు.

మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారని అడగ్గా.. అది కోర్టు పరిధిలో ఉన్న అంశమని.. దానిపై తాను మాట్లాడబోనన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఎస్సైలే బెదిరిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లగా అవన్నీ పరిశీలిస్తామని డీజీపీ పేర్కొన్నారు.

వారాంతపు సెలవు అమలు కావడం లేదు:

‘కొవిడ్‌ మొదలైనప్పటి నుంచే పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు విధానాన్ని పూర్తిగా అమలు చేయడం లేదు. సిబ్బంది కొరతతో పాటు పని ఒత్తిడి వల్ల ఇవ్వలేకపోతున్నాం. ఎన్నికల సమయమైనందున ఇప్పుడు పోలీసుల సెలవులపై కూడా నిషేధం అమలు చేస్తున్నాం. 14,362 మంది పోలీసులు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో తీవ్రంగా ఇబ్బందిపడిన వారికి బందోబస్తు విధులు వేయబోమని డీజీపీ వివరించారు