మహిళా అథ్లెట్‌ హిమదాస్‌ డిఎస్‌పిగా నియామకం

అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు

HimaDas
HimaDas

Dispur : అస్సాం ప్రభుత్వం ప్రముఖ మహిళా అథ్లెట్‌ హిమ దాస్‌ను డిఎస్‌పిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి శర్బానంద సోనొవాల్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అంతేగాక రాష్ట్ర క్రీడావిధానానికి సంబంధించిన సవరణలను కూడా ఆమోదించాలని నిర్ణయించింది. నూతన క్రీడా విధానం ప్రకారం ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర క్లాస్‌-1, క్లాస్‌-2 అధికారులుగా వివిధ శాఖలలో నియమించనున్నారు.

పోలీస్‌, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ తదితర శాఖలలో వీరిని అధికారులుగా నియమించనున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి, పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్‌ పట్వారి వెల్లడించారు. ఈ మేరకు హిమ దాస్‌ను రాష్ట్ర పోలీసు శాఖలో డిప్యూటి సూపరింటెండెంట్‌గా నియమించాలని నిర్ణయించామన్నారు. ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను క్లాస్‌-1 అధికారులుగా నియమిస్తారు.

అస్సాంకు చెందిన 20 ఏళ్ల హిమ దాస్‌ను ‘ధింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ అని ముద్దుగా పిలుస్తారు. 2018లో ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో హిమదాస్‌ 400మీ. పరుగులో స్వర్ణం సాధించింది. అంతర్జాతీయ పోటీలలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్‌ రికార్డు సృష్టించింది.