మయన్నార్‌ సైనిక నేతలపై న్యూజిలాండ్‌ నిషేధం

సైనిక ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోమని వెల్లడి
నిర్బంధంలోని నాయకులను విడుదల చేయాలన్న విదేశాంగ శాఖ

యాంగూస్‌: మయన్నార్‌ లో సైనిక పాలనపై న్యూజిలాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంతో ఉన్న అత్యున్నత, దౌత్య సంబంధాలను తెంచేసుకుంది. మయన్మార్ సైనిక నాయకులపై ప్రయాణ నిషేధాన్ని విధించింది. మంగళవారం విలేకరులతో మాట్లాడిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఈ విషయాలను వెల్లడించారు.

మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోమని ఆమె తేల్చి చెప్పారు. దేశానికి లబ్ధి చేకూర్చే ఏ ప్రాజెక్టులనూ ఇవ్వబోమన్నారు. ఆర్థిక సాయం కూడా చేయబోమన్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా న్యూజిలాండ్ నుంచి చేయాల్సిందంతా చేస్తామని ఆమె హెచ్చరించారు. 2018 నంచి 2021 మధ్య మయన్మార్ కు రూ.218 కోట్ల మేర ఆర్థిక సాయం చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇకపై సైనిక ప్రభుత్వానికి ఆ సాయం చేయడంలో న్యాయబద్ధత లేదని అన్నారు.

కాగా, నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి ననాయా మహుతా అన్నారు. వచ్చే వారం నుంచి మయన్మార్ సైనిక నేతలపై ప్రయాణ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.