భావోద్వేగంతో కంటతడి పెట్టిన అచ్చెన్నాయుడు

చేయని తప్పుకు జైల్లో పెట్టారని ఆవేదన

అమరావతి: ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జైలు నుంచి విడుదలయ్యారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నను బెదిరించినట్టు ఆరోపణలపై అచ్చెన్నాయుడు ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనకు నిన్న సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, కొద్దిసేపటి కిందట జైలు నుంచి బయటికి వచ్చిన అచ్చెన్నాయుడు భావోద్వేగాలకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగా కన్నీటిపర్యంతమయ్యారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, సంబంధం లేని వ్యవహారంలో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వైఎస్‌ఆర్‌సిపి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. తాను ఫోన్ లో అప్పన్నను బెదిరించినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమని అచ్చెన్న ఈ సందర్భంగా సవాల్ విసిరారు. అప్పన్న సోదరుడు కోరినందునే తాను అప్పన్నకు ఫోన్ చేశానని, ఆ కాల్ ను వాళ్లు రికార్డు చేశారని వివరించారు. సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారని ఆరోపించారు.