అగ్నిపథ్ వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరుద్యోగుల ఆందోళన

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు సర్వీస్‌ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే బీహార్, రాజస్థాన్‌లలో నిరసనలు తీవ్రతరం కాగా..తాజాగా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వందలమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి వచ్చి పలు రైళ్లను అడ్డుకోవడం , నిప్పు పెట్టడం చేసారు. దీంతో స్టేషన్ లో , రైళ్లలో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ట్రాక్ మధ్య లో కూర్చొని నిరసన తెలిపారు. ప్లాట్ ఫామ్ నంబర్ 1,2,3లు రణరంగాన్ని తలపించాయి. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లి అక్కడ ఉన్న పార్శల్ బస్తాలను తీసుకొచ్చి పట్టాలపై అడ్డుగా పడేశారు.. వాటిని తగులబెట్టే ప్రయత్నం చేశారు. ప్లాట్ ఫామ్‌ మీద ఉన్న స్టాల్స్‌ను కూడా ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా రెండు బోగీలకు నిప్పు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు.. దీంతో ఆందోళన కారులు మరింత రెచ్చిపోయారు. ఫైర్ ఇంజిన్లపై కూడా రాళ్ల దాడి జరిగింది. ప్రస్తుతం పోలీసులు పరిస్థితి ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.