ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

prajaavaakku
prajaavaakku-voice of the people

ఉద్యోగ సమస్యలే ఎజెండా కావాలి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్ల క్రితం చెల్లించవలసిన కరువుభత్యం బకాయిలు నెలలతరబడి వాయిదాలు వేస్తూ నేటికీ చెల్లించకపోవడం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. పింఛన్లు, వేతనాలు మొదటి తేదీ కాకుండా వారాంతంలో పడడం, చిరుద్యోగులు, పింఛనుదారులూ ఒడి దుడుకులనెదుర్కొంటున్నారు. వేతనాలు ఆలస్యం కావడంతో బ్యాంకుల్లో చెల్లించవలసిన రుణవాయిదాలకు అధిక వడ్డీలు చెల్లించవలసిన దుస్థితి. నాలుగునెలల క్రితం ఇచ్చిన వేతన సవరణ అమలుచేసి, ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు పింఛన్లు చెల్లించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతలు ఒత్తిడి తేవాలి. ఉద్యోగ సమస్యల పరిష్కా రమే ఎజెండా కావాలి.

కార్యక్రమాల ప్రసారంపై నియంత్రణ: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రసార మాధ్యమాలలో భావోద్వేగాలను ప్రేరేపించే కార్యక్రమా ల ప్రసారాన్ని అడ్డుకునేందుకు తగునియంత్రణా చర్యలు చేపట్టాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించడం సబబుగా ఉంది. గతంలో నిజాయితీతో కూడిన సత్యమైన వార్తలను అన్ని ఛానెల్స్‌ ప్రసారం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండేవికావు. పైగాఛానెల్స్‌ అనేక రకాలుగా స్వీయనియంత్రణ పాటించేవి. అయితే రానురాను ప్రసారమాధ్యమాల నిర్వహణ లో మార్పులు వచ్చాయి. రాజకీయ పార్టీలు తమ సొంత ఛానెళ్లు ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థులను దుమ్మెత్తి పోయడం, రాజకీయ లబ్ధికోసం భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి వాటికి పాల్పడుతున్నారు. ఇందువలన శాంతిభద్రతలకు పెను విఘాతం కలుగుతోంది.కాబట్టి ఈవైఖరిని నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసి ప్రసారమాధ్యమాల ప్రసారాలపై నిఘా ఉంచాలి.

సూపర్‌ బజార్లను ఏర్పాటు చేయాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్లా

మూడు దశాబ్దాలక్రితం రాష్ట్రంలో ప్రతీపట్టణంలో సూపర్‌ బజార్లు అద్భుతమైన పనితీరుతో ప్రజలకు ఎనలేని సేవలు చేశాయి. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ సహయసహాకారాలతో తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించిన సూపర్‌ బజార్లు కాలక్రమంలో ప్రైవేటీకరణ దెబ్బకు తట్టుకోలేక శాశ్వ తంగా మూతపబడ్డాయి.ప్రభుత్వాలు కూడా సహకార సంస్థలు నిర్వహించే ఈ సూపర్‌ బజార్లకు ప్రోత్సహకాలు మాని వేశాయి. ఇప్పుడంతా ప్రైవేట్‌ మయమైంది.

రక్తపరీక్షల పేరిట అధిక వసూళ్లు:-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లి జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా వివిధజిల్లాల్లో రక్తపరీక్షలపేరిట ల్యాబ్‌లు సామాన్య ప్రజలను నిలువ్ఞదోపిడీ చేస్తున్నాయి. వివిధ జబ్బు లతో బాధపడేవారు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం వెలితే వైద్యులు ఆ రోగులను పరీక్షించి వివిధ పరీక్షలను నిర్వ హించడానికి లాబ్‌కి రాస్తూఉంటారు.ల్యాబ్‌పరీక్షల కోసం వెళితే వివిధపరీక్షల ధరలుచూసి ప్రజలు భీతిల్లుతూ ఉన్నారు. ఒక్కో ల్యాబ్‌లో ఒక్కోరకంగా ధరలు నిర్ణయిస్తూఉన్నారు. వారి ఇష్టం వచ్చిన రీతిలో ధరలను పెంచుతూ నిలువ్ఞదోపిడీ చేస్తు న్నారు. వీని మీద సరైన పర్యవేక్షణ కొరవడటంతో సిండికేటు గా మారి ప్రజలను పీల్చిపిప్పి చేస్తూ ఆరోగ్యాలతో చెలగాటం అడుతూ ఉన్నారు.ఇకనైనా అధికారులు దృష్టిసారించి ల్యాబ్‌లలో పరీక్షల ధరలు అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

బాలకార్మిక వ్యవస్థను నిరోధించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

బాలకార్మిక వ్యవస్థను నిరోధించే దిశగా కేంద్రప్రభుత్వం చేసిన చట్టాలు అమలులో విఫలం అయిందన్న ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది అనాధ పిల్లలను చేరదీసి వారితో భిక్షాటన చేయించే వ్యాపారం, పిల్లలను కిడ్నాప్‌ చేసి వారిని రహస్యంగా విదేశాలకు తరలించడం, స్వచ్ఛంద సంస్థల పేరుతో, అనాధాశ్రమాల పేరుతో అనాధలను చేరదీసి భిక్షాటన చేయించడం, ఆడపిల్లలకు స్టెరాయిడ్‌లు ఇచ్చి వారిని వ్యభిచార వృత్తిలోకి దింపడం, గల్ఫ్‌ దేశాలకు తరలించి అక్కడ వారిని నానా రకాలుగా వెట్టిచాకిరీ చేయించడం వంటి రకరకాల సం ఘటనలు ఎక్కువవ్ఞతున్నా ప్రభుత్వపరంగా నియంత్రణా చర్య లు శూన్యం. 1977లో భిక్షాటన నిరోధక చట్టం, 1964 నాటి బాలకార్మిక నిరోధకచట్టం అమలులోదారుణంగా విఫలమైంది. ప్రభుత్వాలు కళ్లు తెరిచి బాలలపై జరుగుతున్న అత్యాచార కాండను అరికట్టాలి.

చిరు వ్యాపారులను ఆదుకోవాలి : -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

చిరు వ్యాపారులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవలసిన అవసరం ఉంది. చాలా మంది యువకులు స్వయం ఉపాధితో వివిధ రకాల వ్యాపారాలతో జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి యువకులకు బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తే వారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. యువకులను ప్రోత్సహిస్తే వారు తమ కాళ్లపై నిలబడి జీవిస్తారు. సముచిత రీతిన చిరు వ్యాపారులను ఆదుకోవాలి.