పెరుగుతున్న పౌష్టికాహార లోపం!

children
children

పేదరికాన్ని నిర్మూలించి అందువల్ల సంభ వించే అనర్థాలను నియత్రించేందుకు గత ఆరు, ఏడు దశాబ్దాలుగా పాలకులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు. వ్యాధుల బారినుండి కాపాడలేకపోవడం అటుంచీ, అసలు అనారోగ్యం పాలుకాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమౌతున్నారేమోననిపిస్తు న్నది. ప్రపంచజనాభాలో పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న బాలల్లో నాలుగోవంతు మంది భారత్‌లో ఉన్నారనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యమే మహా భాగ్యం అనే నినాదంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించారు. లెక్కలేనన్ని పథకాలు ప్రజారోగ్యం కోసం ప్రవేశ పెట్టారు. అంతేకాదు పేదలకు పౌష్టికాహారం సమకూర్చే విషయంలో కూడా పాలకులు శ్రద్ధ తీసుకున్నారు. అయినా ఆశించిన ఫలితాలు లభించలేదనే చెప్పాలి. అందుకు కారణాలు, కారకులు ఎవరు అనే విషయం పక్కకు పెడితే పౌష్టికాహారం అందించడంలో విఫలమైనారనేది ఐక్యరాజ్య సమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఐదుసంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో నలభైశాతం మంది తక్కువ బరువు తో పుడుతున్నారని వారిలో ఏడు శాతం మంది పిల్లలు పుట్టిన ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. వీరిలోఅధికశాతం మంది సరైన పౌష్టకారం లోపంతో వివిధ వ్యాధుల బారినపడి మరణిస్తున్నారు. పుట్టిన ప్రతివారికి జీవించే హక్కు రాజ్యంగం కల్పించింది. కానీ ఇలా పౌష్టికార లోపంతో పసిపిల్లలు మరణిస్తుంటే అందుకు బాధ్యత వహించాల్సించింది పాలకపెద్దలేననేది కాదనలేని వాస్తవం. తల్లిబిడ్డకు సకాలంలో పౌష్టికాహారం అందిం చాల్సిన బాధ్యత విస్మరిస్తున్నారని చెప్పక తప్పదు. ఇందుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోతే పోయారు, ఉన్న పథకాలు ఏమేరకు అమలు చేస్తున్నారో ఒక్కసారి పాలక పెద్దలు మనసుపెట్టి ఆలోచించాలి. ప్రధానంగా నగరాల్లో మురికి వాడల్లో ఉంటున్న కోట్లాది నిరుపేదల పరిస్థితి రానురాను దుర్భరంగా తయారు అవుతున్నది. నీటి కాలుష్యం, వాయుకాలుష్యాలతో అశుభ్ర వాతా వరణంతో వ్యాధులు ప్రబలిపోవడంతో వారి పిల్లలు బాధితులు అవ్ఞతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ యూనిసెఫ్‌లు నిర్వహించిన అనేక సర్వేలు, అధ్యయ నాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కలుషిత నీరు వారిని డయేరియా వంటి రోగాలపాలై అసువులు బాస్తున్నారు. పిల్లల్లో పోషకాహారలేమిని లేకుండా చేయడానికి వారికి బలవంతపు ఆహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర పాలకులు ఐ.సి.డి,ఎస్‌ లాంటి పథకాల ద్యారా దేశవ్యాప్తంగా ఏటా వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తూనే ఉన్నారు. ఇందుకోసం ఖర్చు పడుతున్న నిధుల్లో నాలుగోవంతు కూడా వారికి చేరడంలేదు. అధికశాతం దళారులు, మరికొందరు అధికారులు భోంచేస్తున్నారనేది అందరికి తెలిసిందే. ఈ అక్రమాలను నిరోధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు. మరొక పక్క ప్రభుత్వపాఠశాలల్లో చదువు కొంటున్న నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురౌతున్నారు. ఇందుకు కూడా పాలకుల నిర్లక్ష్యమే కారణం. దేశవ్యాప్తంగా మూడోవంతు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లులేవు. ఉన్న వాటిలో కూడా చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయి. యునిసెఫ్‌ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రపంచజనాభాలో 36 శాతం మందికి అవసరం మేరకు సరైన శానిటేషన్‌ లేదని వెల్లడించింది. ఇక సమగ్రశిశు అభివృద్ధి పథకం కింది మాతాశిశు సంరక్షణ కోసం అందించే పౌష్టికాహారం లోఅనేక అవతవకులు జరుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు సేవలందిండంలేదని చెప్పడంలేదు కానీ అశిం చిన మేరకు ఫలితాలు అందించలేకపోతున్నాయి. ఈ విషయంలో గతంలో ఎన్నోసార్లు కాగ్‌ కూడా అభ్యంత రాలు వ్యక్తం చేసింది. పుట్టిన తరువాత పిల్లలకు తల్లి పాలు శ్రేష్టమనే విషయం డాక్టర్లు చెపుతూనే ఉంటారు. మాతృస్తన్యం ద్వారానే పౌష్టికాహారం అందుతుంది. కానీ ఈ విషయం ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్య శాఖ అంతగా చొరవ చూపడంలేదు. తల్లిపాల ప్రాధా న్యతను తెలియచెప్పడానికి ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారం తల్లివారోత్సవాలు జరుపుతున్నారు. శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే తల్లిపాలు ఎంతో ముఖ్యం.
తల్లిపాలు ప్రకృతి ప్రసాదం. దివ్యౌషధం. పురుడు వచ్చే సమయానకి తల్లికి పాలు ఉత్పత్తికావాలి. అందుకు తగిన ఆహారం ఆ తల్లికి అందించాలి. అక్కడే లోపం జరుగుతున్నది. శిశువుకు తల్లిపాలే సరైన ఆహారం అని ప్రపంచదేశాలన్నీ గుర్తించాయి. అయినా ప్రజలకు అహగాహన కల్పించడంలో వెనుకబడే ఉన్నార. ఇక అంగన్‌వాడీల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నది. పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నది. కొన్ని కేంద్రాలకు స్వంతభవనాలు లేవు. చాలా ప్రాంతాల్లో అంగన్‌వాడీలకు వంటకేంద్రాలు, సరకులు నిల్వ చేసుకొనేందుకు అవసరమైన గదులు లేవు. మొత్తం మీద పసిపిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించ డంలో విఫలమవ్ఞతుండడంతో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో నలభై ఆరు మంది, ప్రతి లక్ష మంది గర్భిణీల్లో నూటనలభై మందికి పైగా మరణిస్తు న్నారు. ఇదేకాదు భారత్‌లో ఆహార భద్రతకోసం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (2005)ను అమలు చేస్తు న్నారు. ఈ చట్టం కింద భారత ఆహార భద్రత-ప్రమా ణాల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. ఆహారభద్రత విషయంలో ఇలాంటి చట్టాలు, సంస్థలు ఏర్పాటు చేసి మరెన్నో చర్యలు తీసుకొంటున్నా ఆచరణకు వచ్చే సరికి తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోవడంలేదు. దీంతో పథకాలన్నీ చాలా వరకు కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/