పెద్దిరెడ్డిపై ఆంక్షలు తొలగించిన హైకోర్టు

మీడియాతో మాట్లాడేందుకు ష‌ర‌తుల‌తో అనుమ‌తి

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలు ముగిసేవరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఎస్ఈసీ ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇటీవ‌లే హైకోర్టు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే.

అయితే, ఆయ‌న మీడియాతో మాట్లాడ‌వ‌ద్ద‌న్న ఎస్ఈసీ ఆదేశాల‌ను మాత్రం ఈ సంద‌ర్భంగా స‌మ‌ర్థించింది. మీడియాతో మాట్లాడవద్దన్న సింగిల్‌ జడ్జి ఆదేశాలపై పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్ చేయ‌గా, ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ రోజు మాత్రం హైకోర్టులో పెద్దిరెడ్డికి ఊరట లభించింది. ఆయ‌న‌ మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్ అనుమ‌తి ఇస్తూ కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ప్రక్రియపై మాత్రం మాట్లాడకూడదని, అలాగే, ఎస్‌ఈసీ, కమిషనర్ ను‌ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు పేర్కొంది.