నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారం రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈమె ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతుంది. వారం రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. విష సర్పాలు, కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముర్ము హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. దీనికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ‘ప్రసాద్‌’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూల్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు వస్తారు. బొల్లారం వార్‌ మెమోరియల్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌ విందులో పాల్గొంటారు.

మూడేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ కు రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్ లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి ఆలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామం అనంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇక ఈనెల 27న నారాయణగూడ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సమావేశం కానున్నారు.