నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు

నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర 200వ రోజు

Nara Lokesh in Yuvagalam padayatra

Amaravati: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గురువారం అన్ని నియోజకవర్గాలలో మూడు కిలోమీటర్ల మేర సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. జనవరి 27న ప్రారంభమైన యువగళం… 31-8-2023 నాటికి 200 రోజులు పూర్తికానుంది. 400 రోజుల్లో 4వేల కి.మీ.లు చేరుకోవాలని తొలుత నిర్ణయించగా… నిర్దేశిత లక్ష్యానికంటే ముందుగానే రోజుకు 13.5 కి.మీ.ల పాదయాత్ర చేస్తూ దూసుకుపోతున్నారు. 200 రోజులుగా సాగుతున్న యువగళం పాదయాత్ర 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2710 కి.మీ.లు పూర్తయింది. ఎండనకా, వాననకా పట్టువదలని విక్రమార్కుడిలా సాగుతున్న యువనేత లోకేష్ కు ప్రాంతాలతో సంబంధం లేకుండా జనం బ్రహ్మరథం పడుతున్నారు. అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైనా, భుజం నొప్పి బాధిస్తున్నా అనివార్యమైన సందర్భాల్లో మినహా ఇప్పటివరకు విశ్రాంతి కోసమని ఏ ఒక్కరోజూ యాత్రకు విరామం ప్రకటించలేదు. అందరి అంచనాలను తలకిందులుచేస్తూ లక్షలాది ప్రజలు యువగళంలో భాగస్వాములై తమ గొంతుకను విన్పిస్తున్నారు. యువగళానికి ప్రభంజనంలా తరలివస్తున్న జనసందోహం అధికారపార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. లోకేష్ అనుక్షణం జనంలో మమేకమవుతూ, తనను కలిసే వివిధవర్గాల ప్రజలు చెప్పే సమస్యలను ఓపిగ్గా వింటూ నేనున్నానన్న భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న తీరు విపరీతంగా ఆకర్షిస్తోంది. 200రోజుల పాదయాత్రలో యువనేత లోకేష్ కు 3813 వినతిపత్రాలు యువనేత లోకేష్ కు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు. 200రోజుల యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ కోటిమంది ప్రజలకు కనెక్ట్ అయ్యారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాలు, 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాలను స్పృశిస్తూ యువగళం జైత్రయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు 64 బహిరంగసభల్లో యువనేత లోకేష్ ప్రసంగించగా, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వివిధవర్గాల సమస్యలు తెలుసుకున్నారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/