నిర్ణయాల్లో విశ్వాసం ఉండాలి


నమస్కారం మేడమ్‌! నా పేరు నివేదిత. నాకు 29 సంవత్సరాలు. నేను జాబ్‌ చేస్తున్నాను. మూడేళ్లుగా నేను ఓ వ్యక్తి ప్రేమించుకుంటున్నాము. అతడికి ముందే పెళ్లయ్యిందన్న విషయం నాతో చెప్పలేదు. ఈ విషయం నాకు ఈ మధ్యే తెలిసింది. అప్పటి నుంచి ఆ వ్యక్తికి దూరంగా ఉంటున్నా. ఈ విషయం అతడి భార్యకూ తెలిసి నన్ను మానసికంగా వేధిస్త్తోంది. నా గురించి అందరికి చెడుగా చెబుతానంటూ హింసిస్తోంది. ఇక్కడ నేను చేసిన తప్పేంటో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు నేను ఒక దోషిగా, బాధితురాలుగా మానసికంగా బాధపడుతున్నాను. చాల వేధింపులకు గురవ్ఞతున్నాను. అతని భార్య మా తల్లిదండ్రులకు ఈ విషయం చెపుతాను అని చాలా హింసిస్తోంది. మా తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే వాళ్ల పరుపుపోతుంది. నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్ధం కావడం లేదు మేడమ్‌. ఈ సమస్యకు పరిష్కారం చూపండి మేడమ్‌.
– నివేదిత
మీరు తప్పక ఈ సమస్యల నుండి బయటపడగలరు. ధైర్యంగా ఉండండి. అయిందేదో అయిపోయింది. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి బంధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ మంచి చెడుల గురించి తెలుసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. ప్రేమించే వ్యక్తి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వివాహం చేసుకునే వ్యక్తి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది తప్పనిసరి. ఏది ఏమైనా ఇప్పుడైనా దూరంగా ఉండండి. ఇటువంటి బంధాల నుంచి చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా, మరల పునర్వివాహం నేరం. మీరు ఇలాంటి బాధలు ఇప్పుడు పడనవసరంలేదు. ఎందుకంటే మీరు దూరంగా ఉంటున్నారు కాబట్టి. మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి. జీవితం విలువైంది. ఇతరుల హక్కులను కూడా మీరు గౌరవించాలి. ప్రతిక్షణం స్పష్టతతో, వివేకంతో, అవగాహనతో జీవించాలి. అప్పుడు జీవితం ఆనందమయం చేసుకోవచ్చు. మీరు కూడా అతని భార్యకి స్పష్టంగా తెలియచేయండి. మీరు దూరంగా ఉంటున్నారని అప్పుడు ఆమెకు అర్ధం అవ్ఞతుంది. లేనియెడల మీరు ఎలా ఈ సమస్యకు దూరంగా ఉండాలో కౌన్సిలర్‌ ద్వారా నేర్చుకోండి. వృత్తి నిపుణుల సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వారి సహకారంతో ఆనందంగా జీవించండి.
……….
నమస్కారం మేడమ్‌! నా పేరు సుమతి. నాకు 40 సంవత్సరాలు. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి బిటెక్‌ చదువ్ఞతున్నాడు. మా ఆయన గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మాకు 10 ఎకరాల మామిడితోట ఉంది. అది మా మరిది, మేము ఇద్దరం కలిసి కాపాడుకుంటూ కష్టపడి మామిడి చెట్లను పెద్ద చేశాము. అయితే కొన్నాళ్లకు మా మరిది మామిడి తోటలో వచ్చే ప్రతిది ఏది లెక్క చెప్పకపోవడం. ఒకటికి రెండు రాసిపెట్టడం మొదలు పెట్టాడు. మా ఆయన చాలా అమాయకుడు. కాబట్టి అతన్ని చూసి మోసం చేయాలని అనుకున్నాడు. అసలు మామిడితోట నుండి ఏది కూడా మాకు రాసిచ్చేవాడు కాదు. అందుకు మా ఆయన మా తోట అమ్మివేయాలని నిర్ణయించుకున్నాడు. రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడే ఇలా మోసం చేస్తాడా అని. మా ఆయనకు చాలా బాదేసి భూమి అమ్మాలనుకున్నాడు. కానీ భూమి అమ్మొద్దు.మనకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి భూమి కావాలి అని నేను గొడవపెట్టాను. ఇలా మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తోట అమ్మడము లేదా అనే విషయంతో సతమతమౌతున్నాం మా అబ్బాయి కోసం భూమి లేకపోతే ఎలా అని దిగులుగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపండి మేడమ్‌.

  • సుమతి
    మీరు తప్పక ఈ సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలరు. మీరు సమస్యను పెద్దది చేసుకోకూడదు. చిన్నగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పుడు చిన్న పరిష్కారమార్గం సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువగా నష్టపోకముందే తెలివిగా సమస్యను పరిష్కరించుకోండి.
    మంచి, చెడు మన ఆలోచనారీతి మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల మీరిద్దరూ భార్యాభర్తలు కూలంకషంగా చర్చించుకొని, పరస్పరంగా ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రండి. అమలు పరచుకోండి. గొడవలు పడవద్దు. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. అవతలి వ్యక్తి యొక్క ఆలోచనలను కూడ గౌరవించాలి. మీ అబ్బాయి అభిప్రాయం కూడా తీసుకోండి. మీ పెద్దల యొక్క సలహాలు కూడా తీసుకోండి. అన్ని రకాల సలహాలు విన్న తరువాత, మీ కుటుంబానికి శ్రేయస్కరమైన నిర్ణయం తీసుకోండి. మీరు పొలాన్ని అంటే మామిడి తోటని చక్కగా యాజమాన్యం చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేకపోతే అమ్ముకుని ఆ డబ్బులను జాగ్రత్త పెట్టుకోవచ్చు. ఏ నిర్ణయమైనా మీకు మీ వనరులకు అనుకూలంగా ఉండాలి. మీరు సానుకూలంగా ఆలోచించాలి. విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. అన్నిటికీ మించి జీవితాన్ని ఆనందంగా మలచుకోవాలి.ఇది తప్పక చెయ్యాలి.
  • డాII ఎం. శారద
    సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/