ట్రంప్‌ అభిశంసనపై చర్చ ప్రారంభించిన సెనేట్‌

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పై రెండోసారి అభిశంసన తీర్మానంపై సెనేట్ లో చర్చ మొదలైంది. ఓటింగ్ బలం రిపబ్లికన్లకు 56, డెమొక్రాట్లకు 44గా ఉండటం, ట్రంప్ ను అభిశంసిస్తే, తమకు, తమ పార్టీకి తలవంపులేనని రిపబ్లికన్లు గట్టిగా నమ్ముతూ ఉండటంతో ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన అభిశంసన తీర్మానంపై చర్చించాలని మాత్రం సెనెట్ నిర్ణయించగా, డెమొక్రాట్ల ప్రతినిధులు చర్చను ప్రారంభించారు.

భారీ ర్యాలీగా వచ్చిన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ బిల్డింగ్ పై దాడికి దిగిన వీడియోతో పాటు వారిని ఉద్దేశించి అప్పటికే ఓడిపోయిన ట్రంప్ ఖిఫైట్ లైక్ హెల్ఖి అని వ్యాఖ్యానించే వీడియోను ప్రదర్శిస్తూ చర్చను ప్రారంభించారు. జనవరి 6న జరిగిన ఈ ఘటనలను ప్రస్తావించిన డెమొక్రాట్ సభ్యుడు జిమ్మీ రస్కిన్, భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని తాను ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. జరిగిన ఘటన ఓ అతిపెద్ద నేరమని ఆయన అభివర్ణించారు.

ఇక ఇదే సమయంలో అధ్యక్ష పదవిలో లేని వ్యక్తిపై అభిశంసన ఏంటని పలువురు రిపబ్లికన్ సెనెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో పదవీ బాధ్యతల నుంచి దిగిపోయిన తరువాత అభిశంసనను ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ చరిత్ర సృష్టించారు. బైడెన్ విజయాన్ని ఏ మాత్రమూ స్వాగతించని ఆయన, సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులను రెచ్చగొట్టారన్న ఆరోపణలున్నాయి. కాగా, సెనెట్ లో ఈ వారమంతా ఇదే అంశంపై చర్చ జరగనుంది.